గోబీ మంచూరియాలో వాడే .. కృత్రిమ రంగులపై బ్యాన్‌‌

గోబీ మంచూరియాలో వాడే .. కృత్రిమ రంగులపై బ్యాన్‌‌
  • కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • ఉల్లంఘిస్తే ఏడేండ్ల జైలు, 10 లక్షల ఫైన్

బెంగళూరు : గోబీ మంచూరియా, కాటన్‌‌ క్యాండీ(పీచు మిఠాయి)లలో వాడే కృత్రిమ రంగులపై కర్నాటక ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిని ఉల్లంఘించిన వారికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. పది లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అమ్మకాలు జరుపుతున్న గోబీ మంచూరియా, కాటన్‌‌ క్యాండీలకు సంబంధించి 171 శాంపిల్స్‌‌ను ఫుడ్‌‌ సేఫ్టీ అండ్‌‌ క్వాలిటీ డిపార్ట్‌‌మెంట్‌‌ సేకరించి, ల్యాబ్‌‌లో పరీక్షించింది.

అందులో 107 వంటకాల్లో ఆర్టిఫిషియల్‌‌ కలర్స్‌‌ వాడుతున్నట్లు ఫలితాల్లో వెల్లడైందని ఫుడ్‌‌ సేఫ్టీ కమిషనర్‌‌‌‌ తెలిపారు. రోడమైన్‌‌బీ, టార్ట్రాజిన్‌‌ వంటి ప్రమాదకరమైన రసాయనాలు కలిపిన కలర్స్ ఇందులో వాడుతున్నారని గుర్తించామని తెలిపారు. ఫుడ్‌‌ సేఫ్టీ అండ్ స్టాండర్స్‌‌ యాక్ట్‌‌ 2006 రూల్‌‌ 59 ప్రకారం వీటి వాడకం నిషేధమని, దీనిని ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.