
- ఢిల్లీ కర్నాటక భవన్‌లో కొట్టుకున్న అధికారులు
న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య ఉన్న గ్యాప్ మరోసారి బయటపడింది. ఢిల్లీలోని కర్నాటక భవన్‌లో విధులు నిర్వహిస్తున్న వారి ఇద్దరి స్పెషల్ఆఫీసర్లు పరస్పరం కొట్టుకోవడంతో ఆ గొడవ మరింత రచ్చకెక్కింది. కర్నాటక రాజకీయాల్లో దుమారం రేపుతున్నది. జులై 22న ఢిల్లీలోని కర్నాటక భవన్‌లో సిద్ధరామయ్యకు సన్నిహితుడైన సి.మోహన్ కుమార్ (స్పెషల్ డ్యూటీ ఆఫీసర్), శివకుమార్‌కు సన్నిహితుడైన హెచ్.అంజనేయ మధ్య గొడవ జరిగింది.
ఇది తీవ్ర రూపం దాల్చి ఇద్దరు కొట్టుకున్నారు. సీనియర్ అధికారి ప్రమీలా, సిబ్బంది సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. దీనిపై కర్నాటక భవన్ రెసిడెంట్ కమిషనర్ ఇంకొంగ్లా జమీర్, చీఫ్ సెక్రటరీ షాలినీ రజనీశ్ కు అంజనేయ ఫిర్యాదు చేశాడు. మోహన్ కుమార్ తనను బెదిరించినట్టు అంజనేయ ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ కుమార్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరాడు. మరోవైపు మోహన్ కుమార్ ఈ ఆరోపణలను ఖండించి, అంజనేయ క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నాడని పేర్కొన్నాడు.
దీనిపై చీఫ్ సెక్రటరీ విచారణకు ఆదేశించారు. ఈ ఘటన కర్నాటకలో సిద్ధరామయ్య, డీకే మధ్య ఉన్న లుకలుకలు బయటపడ్డాయి. ఆ రాష్ట్ర బీజేపీ నేత ఆర్.అశోక, కాంగ్రెస్‌లో సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య అధికార పోరు తారాస్థాయికి చేరిందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకత్వం నియంత్రణ కోల్పోయిందని, రాష్ట్రం నాయకత్వ శూన్యంలో ఉందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, ఈ ఘటన రాష్ట్రంలో అంతర్గత సమస్యలను స్పష్టం చేస్తున్నది.