
- అందుకే మీరు ఓడిపోయి ఫామ్ హౌస్‌లో కూర్చున్నరు
- బీజేపీ వీడియో క్రియేట్ చేస్తే బీఆర్ఎస్ సర్క్యూలేట్ చేస్తది
- సిద్ధరామయ్య ఫేక్ వీడియోను రీ ట్వీట్ చేసిన కేటీఆర్
- కర్నాటకలో హామీల అమలుకు డబ్బుల్లేవంటున్నరు
- తెలంగాణలో ఇదే జరుగుతున్నదా? అని కామెంట్
- కేటీఆర్ ట్వీట్‌కు కౌంటర్ ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్
- డీకే ఫేక్ లెటర్‌ను కూడా ఇట్లనే సర్క్యూలేట్ చేశారని ఆగ్రహం
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫేక్ ఏదో.. ఒరిజినల్ ఏదో కూడా తెలియడం లేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ‘తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిందో తెలుసా?’ అంటూ కేటీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. ఫేక్, ఒరిజినల్ కంటెంట్‌ని వెరిఫై చేసుకోవడం తెలియకపోవడంతోనే బీఆర్ఎస్ ఓడిందని ఎద్దేవా చేశారు. బీజేపీ ఫేక్ వీడియోలు తయారు చేసి వదిలితే.. బీఆర్ఎస్ పార్టీ వాటిని సర్క్యులేట్ చేస్తుంటుందని విమర్శించారు. బీఆర్ఎస్ కచ్చితంగా బీజేపీకి ‘బీ’ టీమ్ అని అన్నారు. ‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఇది ఇస్తాం.. అది ఇస్తాం అని మస్త్ చెప్తాం. అంత మాత్రాన అన్నీ ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉన్నా డబ్బుల్లేవు..”అని సిద్ధరామయ్య కర్నాటక అసెంబ్లీలో అన్నారంటూ ఓ ట్విట్టర్ అకౌంట్లో వీడియో పోస్ట్ అయింది.
సిద్ధరామయ్య మాట్లాడినట్టు ఉన్న ఆ వీడియోను మంగళవారం కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. ‘‘హామీల అమలుకు డబ్బుల్లేవని కర్నాటక సీఎం అంటున్నారు. తెలంగాణ విషయంలోనూ ఇదే జరుగుతున్నదా? ఎన్నికల్లో హామీలిచ్చే ముందు రీసెర్చ్ చేయరా?’’అని కేటీఆర్ ట్విట్టర్లో ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన రీ ట్వీట్‌పై సిద్ధరామయ్య వెంటనే రియాక్ట్ అయ్యారు. ‘‘ఫేక్ ఏదో.. ఒరిజినల్ ఏదో తెలుసుకోకుండానే కేటీఆర్ తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. అసలు నిజం ఏంటో తెలుసుకోవాలి. ఫేక్ కంటెంట్‌తో బీజేపీ వీడియో చేసి వదిలింది. 2 రోజుల కిందే దీనిపై వివరణ ఇచ్చాను. ఒరిజినల్ వీడియో కూడా పోస్ట్ చేశాను”అని కేటీఆర్‌కు సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు.
ఆ వీడియోలో అసలు నిజమిదీ..
‘‘అసెంబ్లీలో నేను చెప్పినదాన్ని వదిలేసి అశ్వత్ నారా యణ్, సీటీ రవి లాంటి బీజేపీ నేతలు నా వీడియోను ఎడిట్ చేశారు. 2009 డిసెంబర్లో ఇదే సభలో కౌన్సిల్ సభ్యుడు ఉగ్రప్ప రుణమాఫీ గురించి అప్పటి సీఎం యడ్యూరప్పను అడిగితే.. ఆయన ఏమన్నారో తెలుసా? ‘నా దగ్గర ప్రింటింగ్ మిషన్ ఉందా? ఎక్కడి నుంచి డబ్బు తేవాలి? డబ్బు ఎట్లొస్తది? ఎలక్షన్స్‌లో ఎన్నో చెప్తం.. అవన్నీ అవుతయా? మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రూ.72వేల కోట్ల రుణమాఫీ చేశారు. నేను సీఎంగా ఉన్నప్పుడు రూ.50వేల కోట్ల రుణమాఫీ చేశా..’ అని యడ్యూరప్ప అన్నరు. ఆయన అన్న మాటలే నేను రిపీట్ చేశా. నేను చేసిన కామెంట్లలో కొన్నింటిని మాత్రమే బీజేపీ వాళ్లు తీసుకుని ఫేక్ వీడియో క్రియేట్ చేశారు. ఇలాంటి వీడియోలు చూసే ముందు నిజమేంటో ప్రజలు ఓ సారి క్రాస్ చెక్ చేసుకోవాలి”అని సిద్ధరామయ్య క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్
కేటీఆర్ చేసిన కామెంట్లపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. ‘‘బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్నప్పుడే.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రవళిక గ్రూప్స్‌కి దరఖాస్తు చేసుకోలేదని కేటీఆర్ ఫేక్ స్టేట్మెంట్ ఇచ్చారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఫాక్స్‌కాన్‌ను తరలించుకుపోతున్నారని ఓ ఫేక్ లెటర్ పోస్ట్ చేశారు. ఇప్పుడు కర్నాటక సీఎం సిద్ధరామయ్య పేరుతో ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. ఫేక్ ప్రచారాలే మీ బతుకుదెరువు. అందుకే తెలంగాణ ప్రజలు మీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి ఫాంహౌస్‌లో కూర్చోబెట్టారు. అయినా మీరు మారరా?’’ అంటూ కాంగ్రెస్ పార్టీ మండిపడింది.
అధికారంలో ఉన్నప్పుడు ఫేక్ లెటర్ సర్క్యూలేట్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఫాక్స్‌కాన్ కంపెనీ ఫేక్ లెటర్‌ను సర్క్యూలేట్ చేశారు. యాపిల్ ఎయిర్‌పాడ్స్ తయారీ కేంద్రాన్ని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించాలంటూ ఫాక్స్‌కాన్‌కు డీకే శివకుమార్ లేఖ రాశారని పార్టీ మీటింగ్‌లో కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ లెటర్‌ను కూడా చూపించారు. దాన్నే ప్రజల్లో ప్రచారం చేశారు. అయితే, ఆ లెటర్ ఫేక్ అని డీకే శివకుమార్ అప్పుడే క్లారిటీ ఇచ్చి.. కేటీఆర్‌పై కేసు కూడా పెట్టారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ప్రవళిక సూసైడ్ చేసుకుని చనిపోయినప్పుడు ఆమె అసలు గ్రూప్స్‌కే అప్లై చేయలేదని ఫేక్ ప్రచారం చేశారు. హాల్‌టికెట్ ఉన్నా.. తప్పుడు ప్రచారంతో బురదజల్లే ప్రయత్నం చేశారు. మళ్లీ కర్నాటక సీఎం సిద్ధరామయ్య ఫేక్ వీడియోను పోస్ట్ చేశారు.
ఫేక్ హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు: కేటీఆర్
ఫేక్ ఏదో.. ఒరిజినల్ ఏదో తేల్చుకోవాలంటూ సిద్ధరామయ్య చేసిన సూచనలపై కేటీఆర్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు. ఫేక్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది. 2023, డిసెంబర్ 9 దాటిపోయింది. కౌలు రైతులు సహా రైతులకు ఇస్తామన్న రైతు భరోసా ఏది? రూ.2 లక్షల రుణమాఫీ ఏమైంది? రూ.4వేల చేయూత పింఛన్ ఎక్కడ? రూ.500కే గ్యాస్ సిలిండర్ ఏది? మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం ఊసే లేదు. తొలి కేబినెట్లోనే మెగా డీఎస్సీ, ఫస్ట్ కేబినెట్లోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఏమయ్యాయి? ఇవన్నీ ఫేక్ హామీలేనా.. లేదంటే ఆ హామీలిచ్చిన మీ నేతలు ఫేక్ లీడర్లా? మూడు రాష్ట్రాల్లో మీ పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్న విషయాన్ని గుర్తించండి’’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.