కర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా

కర్ణాటక సీఎం యడియూరప్పకు మళ్లీ కరోనా

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా మళ్లీ సోకింది. గత రెండు రోజులుగా జ్వరం వస్తుండడంతో అనుమానంతో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రెండు రోజుల క్రితం జ్వరం వచ్చినప్పుడు జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌ రాగా జ్వరం తగ్గకపోవడంతో శుక్రవారం ఆయనకు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన స్థానిక మణిపాల్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటునారు. గత ఏడాది ఆగస్టులో ఆయన కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆగస్టు 2న కోవిడ్ గా నిర్ధారణ కావడంతో మణిపాల్ ఆస్పత్రిలో చేరి 9 రోజులపాటు చికిత్స చేయించుకున్న అనంతరం ఆయన కోలుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో ఆయన జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలను, యంత్రాంగాన్ని ప్రతిరోజూ అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన ఆంక్షలకు వెనుకాడబోమని హెచ్చరికలు కూడా చేశారు. ఇటీవల కరోనా వ్యాక్సిన్ వచ్చాక తొలివిడత వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారు కూడా జాగ్రత్తలు పాటించమని పదేపదే హెచ్చరికలు చేస్తూ వచ్చిన ఆయనకు రెండు రోజుల క్రితం జ్వరం సోకింది. తాజాగా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆస్పత్రిలో చేరడానికి ముందు ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించారు. అటు తర్వాత మీడియా వారితోనూ మాట్లాడారు.