నాకు ఇద్దరు పెళ్లాలు.. ఎన్నికల్లో పోటీ చేయకూడదా

నాకు ఇద్దరు పెళ్లాలు.. ఎన్నికల్లో పోటీ చేయకూడదా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ (AAP)కి చెందిన 39 ఏళ్ల  అభ్యర్థి దాఖలు చేసిన అఫిడవిట్ వైరల్ అయ్యింది. కర్ణాటకలోని విజయనగరలో.. 90వ నంబర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ అభ్యర్థి.. తనకు ఇద్దరు భార్యలు,ఐదుగురు పిల్లలు ఉన్నారని ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. శంకర్ దాసర్ (39) కవల సోదరీమణులను పెళ్లి చేసుకున్నారు. ఇదివరకు గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా ఇదే విధంగా తెలిపారు. ఈ అంశం ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఎన్నికలు వచ్చినప్పుడు సహజంగానే ప్రజలు ఆయా అభ్యర్థులు ఆస్తుల చిట్టా తెలుసుకోవాలి అనుకుంటారు. గతంలోకీ, ఇప్పటికీ ఆస్తులు ఎంత పెరిగాయో పోల్చి చూస్తారు. అలాగే ఇళ్లు, పొలాలు, వాహనాల వివరాలను ఆసక్తిగా తెలుసుకుంటారు. ప్రస్తుతం శంకర్ విషయంలో ఇద్దరు భార్యల అంశం ఆసక్తి రేపుతోంది. శంకర్​ దాసరి తన రెండు పెళ్లిళ్ల విషయాన్ని దాచకుండా.. ఉన్నది ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలపడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. రూల్స్ ఎలా ఉన్నా... అతని వరకూ అతను  కేంద్ర ఎన్నికల సంఘాన్ని మోసం చేయలేదని స్థానికులు అంటున్నారు.

"నేను ఇద్దర్ని పెళ్లి చేసుకున్నాను. వారిద్దరూ తోబుట్టువులు. వారు కవలలు. వారి పేర్లు లావణ్య, పుష్పవతి. మాకు ఐదుగురు పిల్లలు. మేమంతా కలిసి జీవిస్తున్నాం. నా నామినేషన్‌ని అమోదిస్తారో లేదో నాకు కచ్చితంగా తెలియదు. నేనైతే నా నామినేషన్‌లో వాస్తవాలను పొందుపొరుస్తూ  కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించి.. నా బాధ్యతను నిర్వర్తించాను." అని బళ్లారి జిల్లాలోని కురుగోడు తాలూకాలో నివసిస్తున్న శంకర్ తెలిపారు. అఫిడవిట్‌లో సమాచారాన్ని స్థానిక అధికారులు స్క్రూటినీ చేస్తారని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని హిందూ వివాహ చట్టాన్ని అనుసరించి పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.కవల సోదరీమణులను పెళ్లి చేసుకోవడం వెనక ఏదైనా కారణం ఉందా అనే అంశాన్ని  ఉన్నతాధికారులు పరిశీలిస్తారని.. స్థానిక అధికారులు తెలిపారు.