అవును.. ఇప్పుడు టమాటాలు కూడా బంగారంలా మారిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా టమాటా ధరలు భారీగా పెరగడంతో కొన్ని చోట్ల టమాటాలను దొంగతనం కూడా చేస్తున్నారు. అనేక రెస్టారెంట్లలో మెనూలో ఉండే టమాటా రసం, టమాటాతో చేసిన ఆహార పదార్థాలను సర్వ్ చేయడం ఆపేశారు. APEDA ప్రకారం, కర్ణాటక మొత్తం టమాటో మార్కెట్ వాటాలో 10.23%తో మొత్తం దేశంలోనే టమాటాల ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉంది.
ALSO READ :పిజ్జా, బర్గర్లలో టమాటాలు ఇవ్వలేం : మెక్ డోనాల్డే ఇలా చెబితే..
టమాటా దాదాపు అన్ని వంటలలో ఉపయోగించే ముఖ్యమైన వంట పదార్థం కాబట్టి, ఈ కూరగాయను పండించే వారు భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. ఇప్పుడు టమోటాలు విలాసవంతమైనవిగా మారడంతో, రైతులు తమ టమాటా పంటలపైనే ఆశలు పెట్టుకున్నారు.
హావేరీకి చెందిన అక్కి, ఆలూరుకు చెందిన ముత్తప్ప అనే రైతు తమ పొలంలో ఎర్రటి టమటాలు కోసి స్థానిక మార్కెట్‌లో అమ్మేందుకు సిద్ధమయ్యారు. అంతే కాదు కొనుగోలు ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా అమర్చారు. వ్యాపారులు కస్టమర్లతో బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా టమాటాలను ఎత్తుకెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి సీసీ కెమెరాలను అమర్చామని వారు స్పష్టం చేశారు.
ఈ మార్కెట్‌లో లభించే టమటాలు ఉత్తమమైనవి, నాణ్యత కలవి. కాబట్టి ప్రజలు ఈ అధిక ధరల సమయంలోనూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా, హాసన్ జిల్లా ధరణి బేలూరు సమీపంలోని గోని సోమనహళ్లి గ్రామంలో రాత్రికి రాత్రే లక్షల విలువైన 50 నుంచి 60 బస్తాల టమటాలను దోచుకెళ్లినట్లు ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. నేటికి కర్ణాటకలో టమాటా ధర కిలో రూ.130 నుంచి 160 వరకు పలుకుతుంది. అయినప్పటికీ, డిమాండ్, లభ్యత ఆధారంగా టమాటాలు ఇప్పటికీ భారీ స్థాయిలో కొనుగోలు అవుతున్నాయి.
