వలస కూలీల ట్రైన్లను నిలిపేసిన కర్నాటక

వలస కూలీల ట్రైన్లను నిలిపేసిన కర్నాటక
  • రాష్ట్రంలోనే ఉండాలని కూలీలకు విజ్ఞప్తి

బెంగళూరు: వలస కూలీలను సొంత రాష్ట్రాలకు చేర్చేందకు ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రైన్లను కర్నాటక ప్రభుత్వం నిలిపేసింది. బిల్డర్లు సీఎం యెడియూరప్పతో మీటింగ్‌ జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కూలీలు వెళ్లిపోతే కంస్ట్రక్షన్‌ బిజినెస్‌, ఇండస్ట్రియల్‌ పనులు ఆగిపోయే అవకాశం ఉందని చెప్పారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూలీలను తరలించేందుకు రోజుకు ఐదు రైళ్లను నడపాలని సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్‌‌)ను కోరిన గవర్నమెంట్‌ వాటిని నిలిపేయాలని చెప్పింది. “ రేపటి నుంచి రైలు సర్వీసులు అవసరం లేదు” అని నోడల్‌ అధికారి మంజునాథ్‌ ప్రసాద్‌ ఎస్‌డబ్ల్యూఆర్‌కు మంగళవారం అర్ధరాత్రి లెటర్‌‌ రాశారు. “ వాళ్లంతా(కూలీలు) లాక్‌డౌన్‌ తర్వాతే వెళ్లాలి. ఇప్పుడు ఇక్కడే ఉండనివ్వండి. మేం జాగ్రత్తగా చూసుకుంటాం” అని లేబర్‌‌ డిపార్ట్‌మెంట్‌ సెక్రటరీ మణివన్నన్‌ అన్నారు. కాగా.. వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, స్టూడెంట్స్‌ తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్పులు చేశారు. ఇంతకుముందు ‘ఒక సమయం, ఒక రోజు, వన్‌వే పాస్‌లు’ అని రాసిఉన్న పదాలను ‘వన్‌ టైమ్‌, టూవే పాస్‌లు” అని మార్చారు. అంటే దీని ప్రకారం వలస కార్మికులు కర్నాటకకు తిరిగి వచ్చేందుకు వీలు ఉంటుంది.