
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శక్తి పథకం ద్వారా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తోంది. కేఆర్టీసీలో ఉచిత ప్రయాణం వల్ల రాష్ట్రానికి రూ. 295 కోట్ల నష్టం వాటిల్లడంతో కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీలను పెంచాలని యోచిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలను 15 నుంచి 20 శాతం వరకు పెంచేందుకు కర్ణాటక ఆర్టీసీ(కేఎస్ఆర్టీసీ) ఆలోచిస్తుంది. 2019 నుంచి బస్సుల్లో టికెట్ ఛార్జీలను పెంచలేదన్నారు. గడిచిన మూడు నెలల్లో సంస్థకు రూ.295 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు తెలిపారు.
ఆర్టీసీ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని కేఎస్ఆర్టీసీ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ జులై 14న వివరించారు. ఛార్జీల పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపామన్నారు. ఛార్జీలు పెంచాలా వద్దా అనే విషయంలో సీఎం సిద్ధరామయ్య తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. డీజిల్, నిర్వహణ వ్యయం పెరగడం వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందన్నారు. పెంచే ఛార్జీలు కేవలం పురుషులపైనే భారం పడుతుంది దీంతో ఛార్జీలు పెంపుపై తీవ్ర విమర్శ వస్తుందని భావిస్తున్నారు.