
బెంగళూరు: పోలీసులను సంప్రదించకుండానే, అనుమతి లేకుండానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. ఐపీఎల్ విజయోత్సవాలకు పిలుపునిచ్చిందని కర్నాటక ప్రభుత్వం పేర్కొంది. వేడుకల నిర్వహణపై పోలీసులకు సమాచారం మాత్రమే ఇచ్చారని, ఎలాంటి ఫార్మాట్‌లో ఆర్సీబీ అభ్యర్థించలేదని చెప్పింది.
ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై నివేదికను కర్నాటక సర్కారు గురువారం హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది. ఇందులో విరాట్ కోహ్లీ పేరును కూడా ప్రస్తావించింది.
ఆర్సీబీకి సేవకుల మాదిరిగా పోలీసులు..
ప్రభుత్వం సమర్పించిన నివేదికలో పోలీసు అధికారులు ఆర్సీబీ సేవకుల్లాగా పనిచేశారని పేర్కొంది. జూన్ 3న ఆర్సీబీ మేనేజ్‌మెంట్.. విజయోత్సవ పరేడ్ గురించి పోలీసులకు సమాచారం మాత్రమే ఇచ్చిందని, చట్టప్రకారం అవసరమైన పర్మిషన్ తీసుకోలేదని వెల్లడించింది.
ఇలాంటి ఈవెంట్లకు 7 రోజుల ముందు పర్మిషన్ తీస్కోవాల్సి ఉండగా, ఒక రోజు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారని పేర్కొంది. వేడుకకు ఎంతమంది వస్తారనే వివరాలు ఇవ్వకపోవడంతో పోలీసులు అనుమతి ఇవ్వలేదని పేర్కొంది. స్టేడియం నుంచి 14 కీలోమీటర్ల మేర ప్రజలు గుమిగూడారని, అప్పటికే పోలీస్ సిబ్బందిని మోహరించామని తెలిపింది.
అంతమందిని చూసి ప్రోగ్రాం నిర్వాహకులు ఎంట్రీ పాస్ ఉంటేనే స్టేడియంలోకి అనుమతిస్తామని చెప్పడంతో వాళ్లంతా గందరగోళానికి గురయ్యారంది. దీంతో గేట్లు తెరవగా ఒక్కసారిగా అభిమానులు చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదికలో పేర్కొంది.