కృష్ణా మిగులు జలాల్లో తెలంగాణకు హక్కులేదట!

కృష్ణా మిగులు జలాల్లో తెలంగాణకు హక్కులేదట!
  • ఏపీకి మాత్రమే రైట్‌ ఉందంటున్న కర్నాటక
  • మిగులు జలాలనే నమ్ముకొని రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు
  • రేపు ఏపీ కూడా కర్నాటకకు వంతపాడితే ఎట్ల?
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న మన ఇంజనీర్లు

హైదరాబాద్‌, వెలుగుకృష్ణా మిగులు జలాలపై తెలంగాణకు హక్కుల్లేవంటూ ఎగువ రాష్ట్రం కర్నాటక కొత్త లొల్లి లేవనెత్తుతోంది. కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఇప్పుడు  తెలంగాణ కూడా ఎగువ రాష్ట్రమేనని, మిగులు జలాలు ఉపయోగించుకునే అధికారం లేదని అంటోంది. దిగువ రాష్ట్రంగా అన్ని రైట్స్​ ఏపీకే ఉన్నాయని చెబుతోంది. దీనిపై ఇటీవల కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఇదే రీతిగా రేపోమాపో ఆంధ్రప్రదేశ్​ కూడా గొంతు కలిపితే మిగులు జలాలపై ఆధారపడిన రాష్ట్రంలోని ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టుల పరిస్థితి ప్రమాదంలో పడే అవకాశముందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం దోస్తీ కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలోనూ కృష్ణాలో నీటి దోపిడీ ఆగడం లేదని, ఏపీ అధికారులు తప్పుడు లెక్కలు చూపుతూ నీటిని దారి మళ్లిస్తూనే ఉన్నారని వారు అంటున్నారు. (మొదటి పేజీ తరువాయి)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోనే తెలంగాణలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఏఎంఆర్పీ- ఎస్‌‌‌‌ఎల్బీసీ ప్రాజెక్టులను మిగులు జలాలపై ఆధారపడి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులకు గరిష్టంగా 232 టీఎంసీల నికర జలాలను కేటాయించాల్సి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, కర్నాటక ప్రభుత్వాలు పాలమూరు, డిండి ప్రాజెక్టులు అక్రమమని ఫిర్యాదు చేశాయి. అపెక్స్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ సమావేశంలో ఏపీ వాదనను తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందున తమ రాష్ట్రానికి కృష్ణా జలాలను కొత్తగా కేటాయించాలని ప్రభుత్వం 2014 జూలై 7న కేంద్ర జలవనరుల శాఖను కోరింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించినందున, ఈ విషయాన్ని బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ వద్దే తేల్చుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌‌‌‌లో అప్పీల్‌‌‌‌ చేసినా ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌‌‌‌ 89కి ఉన్న పరిమితుల దృష్ట్యా కృష్ణా జలాల పునః పంపిణీని నాలుగు రాష్ట్రాల మధ్య కాకుండా ఏపీ, తెలంగాణకే బోర్డు పరిమితం చేసింది. ఐసీడబ్ల్యూఆర్‌‌‌‌ చట్టంలోని సెక్షన్‌‌‌‌ -3 ప్రకారం కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో అర్థించింది. కృష్ణా నది క్యాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏరియా (పరివాహక ప్రాంతం) తెలంగాణలో 19.9 శాతం ఉండగా 299 టీఎంసీలే కేటాయించారని, 9.2 శాతం క్యాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏరియా ఉన్న ఏపీకి 512 టీఎంసీలు కేటాయించారని రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. బచావత్‌‌‌‌ అవార్డులో శాస్త్రీయత లేదని, తెలంగాణకు న్యాయం చేయాలంటే నీటిని తిరిగి పంపిణీ చేయాలని డిమాండ్‌‌‌‌ చేస్తోంది.

దోస్తీ సరే.. దోపిడీ మాటేంది?

పోలవరం ప్రాజెక్టుకు తుది అనుమతులు రాగానే కృష్ణా నికర జలాల్లో 80 టీఎంసీలను ఎగువ రాష్ట్రాలకు కేటాయించాలని బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ తన అవార్డులోనే పేర్కొంది. పోలవరం పూర్తి కాకున్నా పట్టిసీమ నుంచి గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర 35 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణకు దక్కాల్సిన నికర జలాల్లోని 45 టీఎంసీలు ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అడ్డు తగులుతూ వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ సర్కారుతో రాష్ట్ర ప్రభుత్వానికి దోస్తీ ఉన్నా కూడా నికర జలాల్లో దక్కాల్సిన 45 టీఎంసీలను ఉపయోగించుకునేలా ఒప్పందమేమి జరగడం లేదని ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి క్యాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏరియా ఆధారంగా 50 శాతం నీటిని కేటాయించాలని, ఈ లెక్కన రాష్ట్రానికి 406 టీఎంసీల నీళ్లు దక్కాలని అధికారులు వాదిస్తున్నారు. బ్రజేశ్‌‌‌‌ ట్రిబ్యునల్‌‌‌‌ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 190 టీఎంసీల మిగులు జలాలను విభజన చట్టం ప్రకారం పంచితే మరో 70 టీఎంసీలు దక్కాలని ఇంజనీర్లు చెప్తున్నారు. కృష్ణా జలాల్లో ఏపీ చేస్తున్న దోపిడీ ఆగకపోగా, నికర జలాల్లో రావాల్సిన 45 టీఎంసీలను ఇవ్వడం లేదని, ఇప్పుడు కర్నాటక వాదిస్తున్నట్టుగానే రేపు ఏపీ కూడా నికర జలాలు తప్ప మిగులు జలాల్లో తెలంగాణకు వాటా లేదంటే ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాల పరిస్థితి ఏమిటని తెలంగాణ ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేటాయింపులను పూర్తిగా వాడుకోలేని స్థితిలో  రాష్ట్రం

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 299 టీఎంసీలను కేటాయించగా.. వాటిలో నాగార్జున సాగర్‌‌‌‌ ఎడమ కాలువకు 105 టీఎంసీలు, జూరాలకు 17.84 టీఎంసీలు, ఆర్డీఎస్‌‌‌‌కు 15.90 టీఎంసీలు, భీమాకు 20 టీఎంసీలు, మూసీ ప్రాజెక్టుకు 9.40 టీఎంసీలు, మైనర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌కు 90 టీఎంసీలు, కోయిల్‌‌‌‌సాగర్‌‌‌‌, డిండి (పాత ప్రాజెక్టు), పాలేరు, వైరా తదితర మీడియం ఇరిగేషన్‌‌‌‌ ప్రాజెక్టులకు 40 టీఎంసీలు కేటాయించారు. మైనర్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ కేటాయింపుల్లో  ఏటా 60 టీఎంసీలకు పైగా నీటిని తెలంగాణ కోల్పోతోంది. ఆర్డీఎస్‌‌‌‌ నుంచి 6 టీఎంసీలకు మించి వినియోగించుకున్నది లేదు. భీమా నుంచి ఎక్కువకు ఎక్కువ 8 టీఎంసీలు వాడుకున్నది లేదు. సాగర్‌‌‌‌ ఎడమ కాలువలోనూ పూర్తి స్థాయి నీళ్లు ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. రాష్ట్రానికి కేటాయించిన నీటిలో ఏటా 140 టీఎంసీలకు పైగా రాష్ట్రం వినియోగించుకోలేకపోతున్నదని అధికారులే చెప్తున్నారు. దీన్ని సరిదిద్దాలని కోరుతున్నారు.