- కట్నం కోసం ఐపీఎస్‌కు వేధింపులు
- భర్త కూడా ఐఎఫ్ఎస్ అధికారే
ఎన్ని చట్టాలొచ్చినా కట్నం కోసం ఇంకా వేధింపులు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే వరకట్న బాధితులను కాపాడే పోలీసులకే కట్నం వేధింపులు ఎదురైతే? తాజాగా అటువంటి ఘటనే కర్ణాటకలోని బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓ మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌కే ఈ వేధింపులు ఎదురయ్యాయి. కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న వర్తికా కటియార్‌కు ఈ అనుభవం ఎదురైంది. మరి వేధింపులకు పాల్పడిన ఆమె భర్త నితీన్ సుభాష్ యోలా ఏదో పనిచేసుకునే వాడా అంటే అది కూడా కాదు. ఆయన కూడా ఒక ఐఎఫ్ఎస్ అధికారి. భర్తతో పాటు అతని కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువైపోవడంతో.. వర్తికా తన భర్త మరియు అతని కుటుంబంపై ఫిబ్రవరి 1న కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
వర్తికా తన ఫిర్యాదులో భర్తతో పాటు మరో ఆరుగురు కుటుంబ సభ్యులను నిందితులుగా పేర్కొన్నారు. నితీన్ తండ్రి సుభాష్ యోలా, తల్లి అమోల్ యోలా, బంధువులు సునీతా యోలా, సచిన్ యోలా, ప్రజక్త యోలా, ప్రద్న్య యోలాలను నిందితులుగా పేర్కొంటూ ఆమె ఫిర్యాదు చేశారు.
వర్తికా 2011 లో నితీన్‌ను వివాహం చేసుకుంది. ఆ పెళ్లికి అయిన ఖర్చులు కూడా వర్తికా కుటుంబమే భరించింది. అప్పుడు నితీన్‌కు బంగారం, భారీగా డబ్బులు ముట్టజెప్పారు. అయితే పెళ్లి తర్వాత కూడా బంగారు ఆభరణాల కోసం నితీన్ మరియు అతని కుటుంబం తన కుటుంబాన్ని బలవంతం చేసిందని వర్తికా ఆరోపించింది. ఆ క్రమంలోనే కారణం లేకుండా మాటలతో మానసికంగా హిసేంచేవారని వర్తికా పేర్కొంది. పెళ్లైన మూడు నెలలకే మూడు లక్షల రూపాయలు కావాలని నితీన్ కుటుంబం డిమాండ్ చేసిందని.. ఆ మొత్తం ఇవ్వకపోతే పెళ్లిని రద్దు చేస్తామన్నారని ఆమె తెలిపింది. పెళ్లి రద్దు చేస్తారనే భయంతో నితీన్ కుటుంబం అడిగిన మొత్తాన్ని ఇస్తూ వచ్చామని ఆమె పేర్కొన్నారు. నితీన్ 2012లో వర్తిక అమ్మమ్మ ఇంటికి వెళ్లి రూ. 5 లక్షలు డిమాండ్ చేశాడని.. వాళ్లు నితీన్‌కు చెక్కు ఇచ్చారని వర్తిక తెలిపింది. నితీన్ తనను మానసికంగా వేధించడంతో పాటు శారీరకంగా కూడా వేధించాడని వర్తికా ఆరోపించారు. 2016లో ఒకసారి తనతో గొడవపడి కొట్టడంతో తన చేయి కూడా విరిగినట్లు ఆమె తెలిపింది. చివరికి గర్భవతిగా ఉన్న సమయంలో కూడా తిడుతూ కొట్టేవారని తెలిపింది. వర్తిక ఫిర్యాదుతో నితీన్ మరియు అతని కుటుంబసభ్యులపై వరకట్న నిషేధ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
For More News..
