కర్ణాటకలో లోకాయుక్త రైడ్స్.. అధికారుల ఇండ్లలో సోదాలు.. కోట్ల విలువైన గోల్డ్, క్యాష్, ప్రాపర్టీ డీడ్స్ సీజ్

కర్ణాటకలో లోకాయుక్త రైడ్స్.. అధికారుల ఇండ్లలో సోదాలు..  కోట్ల విలువైన గోల్డ్, క్యాష్, ప్రాపర్టీ డీడ్స్ సీజ్

అక్రమాస్తుల కేసులో కర్ణాటక లోకాయుక్త దర్యాప్తు ముమ్మరం చేసింది.. మంగళవారం ( నవంబర్ 25) ఉదయం బెంగళూరుతోపాటు పలు ప్రాంతాల్లో 10మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో దాడులు  చేసింది. ఈ దాడుల్లో కోట్ల విలువైన ఆస్తులు, బంగారం, పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకుంది.  

మంగళవారం ఉదయం బెంగళూరు నగరం, బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, దావణగెరె, హావేరి, బీదర్, ఉడిపి, బాగల్‌కోట్, హాసన్‌లోని 48 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు లోకాయుక్త అధికారులు.కర్ణాటకలోని అన్ని శాఖల్లోని సీనియర్ , మధ్యస్థాయి అధికారులను లక్ష్యంగా చేసుకుని లోకాయుక్త  దాడులు చేసింది.ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని లోకాయుక్త వర్గాలు తెలిపాయి.

అక్టోబర్ ప్రారంభంలో కూడా కర్ణాటక లోకాయుక్త 12 మంది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ఇండ్లపై దాడులు చేసింది. రూ.38.10 కోట్ల ఆదాయానికి మించి ఆస్తులను (DA) వెలికితీసింది. ఈ అక్రమాస్తుల జాబితాలో రూ.24.34 కోట్ల స్థిరాస్తులు, కోట్ల విలువైన ఆభరణాలు వంటి చరాస్తులు ,రూ.1.20 కోట్ల నగదు సీజ్ చేసింది. బీదర్ జిల్లాలోని ఓఅధికారి దగ్గర రూ.83.09 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

పట్టుబడ్డ అవినీతి అధికారులు 

  • రామస్వామి సి, రెవెన్యూ ఇన్స్పెక్టర్, హూట్గల్లి మునిసిపాలిటీ, మైసూర్
  • పుట్ట్స్వామి సి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, మండ్య టౌన్ మునిసిపాలిటీ
  • ప్రేమ్ సింగ్, చీఫ్ ఇంజనీర్, అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్, బీదర్
  • సుభాష్ చంద్ర, అసిస్టెంట్ ప్రొఫెసర్, సోషియాలజీ, కర్ణాటక విశ్వవిద్యాలయం, ధార్వాడ్
  • సతీష్, సీనియర్ వెటర్నరీ ఇన్స్పెక్టర్, ప్రాథమిక వెటర్నరీ క్లినిక్, హుబ్లి, ధార్వాడ్
  • షేఖప్ప, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం, హవేరి
  • కుమార్స్వామి పి, ఆఫీస్ సూపరింటెండెంట్, ప్రాంతీయ రవాణా కార్యాలయం, ఎలక్ట్రానిక్ సిటీ, బెంగళూరు
  • లక్ష్మీపతి సిఎన్, ఫస్ట్ గ్రేడ్ అసిస్టెంట్, సిమ్స్ మెడికల్ కాలేజీ, శివమొగ్గ
  • ప్రభు జె, అసిస్టెంట్ డైరెక్టర్, వ్యవసాయ అమ్మకాల డిపో, APMC, దావణగెరె
  • గిరీష్ DM, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, PWD, మైసూర్-మడికేరి