లారీలు ఆపుతున్నారని..బార్డర్లో కర్నాటక లారీ డ్రైవర్ల నిరసన

లారీలు ఆపుతున్నారని..బార్డర్లో కర్నాటక లారీ డ్రైవర్ల నిరసన
  • కర్నాటక లారీ డ్రైవర్ల ఆరోపణ..
  • నారాయణపేట జిల్లా బార్డర్​లో హైవేపై నిరసన

నారాయణపేట/మాగనూర్, వెలుగు: నారాయణపేట జిల్లాలోని కర్నాటక బార్డర్​లో హైడ్రామా నడుస్తోంది. కర్నాటక కేపీసీఎల్(కర్నాటక పవర్ కార్పొరేషన్​ లిమిటెడ్)​ నుంచి హైవే మీదుగా తెలంగాణకు వస్తున్న వందలాది బూడిద లారీలను రెండు రోజులుగా పోలీసులు ఆపుతున్నారు. సహనం నశించిన లారీ డ్రైవర్లు శుక్రవారం ధర్నాకు దిగారు. దీంతో బార్డర్​లో రెండు గంటలపాటు భారీగా ట్రాఫిక్ ​జామ్​ అయింది. ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లారీల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని తమకు ఫిర్యాదు రావడం వల్లే నిలిపేశామని పోలీసులు చెబుతుండగా, లోకల్ ఎమ్మెల్యే ఒక్కో లారీకి రూ.10 వేల చొప్పున మామూలు అడిగారని, ఇవ్వక పోవడం వల్లే పోలీసులతో నిలిపివేయిస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపించారు. 

రోడ్డు వెంట వందలాది లారీలు.. 

కర్నాటక రాష్ట్రం శక్తినగర్ లోని​ కేపీసీఎల్​లో బూడిదను కాంట్రాక్ట్​ తీసుకున్న కొందరు తెలంగాణలోని నారాయణపేట, వనపర్తి, నాగర్​కర్నూల్, మహబుబ్​నగర్, హైదరాబాద్ శివారులోని ఫ్లైయాష్​ఇటుక బట్టీలకు సరఫరా చేస్తున్నారు. బార్డర్ చెక్​పోస్టుల్లో ఆర్టీఏ చెకింగ్​ పూర్తయ్యాకే  రాష్ట్రంలో ప్రవేశిస్తున్న వందలాది లారీలను రెండు రోజులగా కృష్ణ మండలం గుడెబల్లూర్ వద్ద లోకల్​పోలీసులు ఆపుతున్నారు. దీంతో రోడ్డు వెంట లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. శుక్రవారం రెండు గంటల పాటు ట్రాఫిక్​నిలిచిపోయింది. లారీల వల్ల కృష్ణ, మాగనూర్, కున్సి, మక్తల్​ఏరియాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయని, బూడిద వల్ల జనం ఇబ్బందిపడుతున్నారని తమకు ఫిర్యాదు రావడం వల్లే నిలిపివేశామని పోలీసులు చెబుతుండగా లారీ డ్రైవర్ల వాదన మరోలా ఉంది. స్థానిక ఎమ్మెల్యే ఒక్కో లారీకి రూ.10 వేల చొప్పున మామూలు అడిగారని, ఇవ్వకపోవడం వల్లే పోలీసులతో ఆపివేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈమేరకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తమ లారీలను విడిచిపెట్టాలని డ్రైవర్లు డిమాండ్​ చేశారు. పైఆఫీసర్ల నుంచి ఫోన్లు రావడంతో లోకల్ పోలీసులు వెనక్కి తగ్గారు. ఓవర్​లోడ్​ లేకుండా చూస్తామని, బూడిద కిందపడకుండా లారీలపై టార్పాలిన్లు కప్పుతామని డ్రైవర్లతో హామీ తీసుకొని విడిచిపెట్టారు.