కేసీఆర్ కుటుంబం చేతిలో..తెలంగాణ బందీ : దినేశ్ గుండు రావు

కేసీఆర్ కుటుంబం చేతిలో..తెలంగాణ బందీ : దినేశ్ గుండు రావు

హైదరాబాద్, వెలుగు : అభివృద్ధి నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం.. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని కర్నాటక మంత్రి దినేశ్ గుండు రావు విమర్శించారు. మిగులు నిధులతో ఏర్పడిన రాష్ట్రం అప్పుల పాలైందని, అయినా అభివృద్ధి మాత్రం జరగలేదని అన్నారు. గాంధీభవన్​లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నాటకలో ఐదు గ్యారెంటీలను మూడు నెలల్లోనే అమలు చేశామన్నారు. అన్న భాగ్య స్కీమ్ కింద ప్రజలకు బియ్యం పంపిణీ చేయాలనుకుంటే..

కేంద్రం సహకరించలేదని ఆరోపించారు. దీంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని తెలిపారు. లక్షల కోట్లు దోచుకున్న బడా బడా వ్యాపారులకు కేంద్రం రుణ మాఫీ ప్రకటించిందని మండిపడ్డారు. కర్నాటకలో మహిళలకు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. తెలంగాణలోనూ ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

కర్నాటక పరిస్థితులు వేరు

కరెంట్ విషయంలో తెలంగాణ, కర్నాటక పరిస్థితులు వేర్వేరు అని దినేశ్ గుండు రావు అన్నారు. తెలంగాణలో కరెంట్ మిగులు ఉండగా.. కర్నాటకలో లేదన్నారు. అక్కడ అందరికీ అవసరమైనంత మేర కరెంట్ సప్లై చేస్తున్నామని తెలిపారు. ఇండ్లు, పరిశ్రమలు, రైతులకు సరిపడా కరెంట్ సరఫరా జరుగుతున్నదని వివరించారు. అందరూ సంతోషంగా ఉన్నారని, ఎలాంటి ఇబ్బందుల్లేవని, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లకు ఏమైనా డౌట్లు ఉంటే కర్నాటక వచ్చి క్లారిటీ తెచ్చుకోవాలని సూచించారు.

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కరెంట్ చార్జీలు కొంత పెంచాల్సి వచ్చిందని, అయినా.. సామాన్యులకు ఎలాంటి సమస్యా లేకుండా చార్జీలు అమలు చేస్తున్నామని చెప్పారు. కర్నాటక రైతులు ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం ఎన్నికల జిమ్మిక్కే అని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కలిసి ఆడిస్తున్న డ్రామా అని ఆరోపించారు.