కాంగ్రెస్ ​పాలనలో కర్నాటక ఆగమాగం : మంత్రి నిరంజన్​రెడ్డి విమర్శలు

కాంగ్రెస్ ​పాలనలో కర్నాటక ఆగమాగం : మంత్రి నిరంజన్​రెడ్డి విమర్శలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ పాలనలో ఉన్న కర్నాటకలో అంధకారం అలుముకుందని, ఆరు నెలలకే ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతోందని మంత్రి నిరంజన్​రెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నాటకలో కాంగ్రెస్​ గ్యారంటీలు పూటకోటి ఎగిరిపోతున్నాయన్నారు. కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నీళ్లను బీళ్లకు మళ్లించుకుంటున్నామని తెలిపారు. విద్య, వైద్యం సహా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ఇంకోటి లేదన్నారు.

కనుల ముందు కనిపిస్తున్న అభివృద్ధి వదిలేసి కాంగ్రెస్​నేతలు మాయ మాటలు చెప్తున్నారని.. వాటిని ప్రజలు నమ్మబోరన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని అడిగితే ఇడ్లీనా, దోశనా అని అధికార మదంతో కాంగ్రెస్ ​చేసిన అవహేళనలతో యువత గుండెచెదిరి ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్ ​తెలంగాణకు చేసిన గాయాలను ప్రజలు మరిచిపోరన్నారు. మూడోసారి బీఆర్ఎస్ ​అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా తమ ప్రభుత్వం ప్రజల్లోనే ఉందని..  మేం ఏమేం చేశామో వారికి తెలుసన్నారు. చేసింది.. చేసేది తామే కనుక వాటి గురించి ప్రజలు అడుగుతున్నారని తెలిపారు. కేసీఆర్ సభలకు వస్తున్న ప్రజాదరణే దీనికి నిదర్శనమన్నారు.