రాజకీయ కల్లోలానికి కేరాఫ్‌గా మారిన కర్నాటకలో అధికార కూటమికి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం రాజీనామా చేశారు. ఇప్పటికే ముంబైలో మకాంవేసిన రెబల్స్ ఎంతకీ వెనక్కితగ్గడంలేదు. రాజీనామాల విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని సవాలుచేస్తూ రెబల్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాళ్లను కలిసేందుకు ముంబై వెళ్లిన కర్నాటక మంత్రి డీకే శివకుమార్‌ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. ఎలాగైనాసరే కర్నాటకలో సర్కార్ ఏర్పాటుచేసి తీరుతామంటున్న బీజేపీ.. గవర్నర్ ద్వారా చక్రంతిప్పే ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ నేతల్ని కలిసేందుకు గవర్నర్ నో చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తంగా పరిణామాలన్నీ.. కుమారస్వామి సీఎంగా కొనసాగడం కష్టమనే సంకేతాలిస్తున్నాయి.
16కు పెరిగిన రాజీనామాలు.. సుప్రీంలో పిటిషన్
హౌసింగ్ మినిస్టర్‌గా పనిచేసిన ఎంబీటీ నాగరాజు, స్టేట్ పొల్యూషన్ బోర్డు చైర్మన్‌గా ఉన్న కే.సుధాకర్ బుధవారం తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. సిద్ధరామయ్య గ్రూప్‌కు చెందిన ఈ ఇద్దరూ నేరుగా (మొదటి పేజీ తరువాయి)
స్పీకర్ సురేశ్‌కుమార్‌ను కలిసి లెటర్లు అందజేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ఎమ్మెల్యేల్ని అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. జరుగుతున్న పరిణామాల్ని చూసి కలత చెందానని, పదవి నుంచే కాదు పాలిటిక్స్‌కే గుడ్‌బై చెబుతున్నానని మంత్రి నాగరాజు మీడియాకు తెలిపారు. వీళ్లిద్దరితో కలిపి రాజీనామాలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్య 16కు పెరిగింది. వీళ్లలో 13 మంది కాంగ్రెస్ సభ్యులుకాగా, ముగ్గురు జేడీఎస్ మెంబర్లు. రెబల్ గ్రూప్‌లోని 14 మందిలో 9 మంది ఎమ్మెల్యేల రాజీనామాల్ని స్పీకర్ మంగళవారమే తిరస్కరించిన సంగతి తెలిసిందే. తమ రిజిగ్నేషన్లు ఫార్మాట్లో ఉన్నా, స్పీకర్ కావాలనే తిరస్కరించారని రెబల్స్ ఆరోపిస్తున్నారు. ఈవిషయంలో కలుగజేసుకోవాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించాలా, వద్దా అనేదానిపై గురువారం నిర్ణయం తీసుకుంటామని సీజేఐ రంజన్ గొగోయ్ బెంచ్ తెలిపింది. మొత్తం 224 మంది సభ్యులున్న కర్నాటక అసెంబ్లీలో స్పీకర్ కాకుండా కాంగ్రెస్–జేడీఎస్ సర్కారుకు 116 మంది ఎమ్మెల్యులున్నారు. రాజీనామాలు ఆమోదం పొందితే ప్రభుత్వం కూలడం ఖాయం. ఇండిపెండెంట్ల మద్దతుతో తన బలం 107కు పెరిగిందన్న బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరుతున్నది.
ముంబైలో హైడ్రామా
ముంబైలో కర్నాటక రెబల్ ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్(రినాయిజెన్స్ ఇన్) వద్ద బుధవారం హైడ్రామా నెలకొంది. జేడీఎస్ నేత శివలింగ గౌడతో కలిసి హోటల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కర్నాటక మంత్రి డీకే శివకుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రూమ్ బుక్ చేసుకున్నామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఎమ్మెల్యేలు ఓకే అంటేనే లోపలికి పంపిస్తామని పోలీసులు అనడంతో, ‘వాళ్లంతా మా ఎమ్మెల్యేలే. ఒక్కసారి మాట్లాడి వచ్చేస్తా’అని శివకుమార్ చెప్పారు. కర్నాటక నుంచి వచ్చే లీడర్లతో ప్రాణహాని ఉందంటూ అంతకు ముందే ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు.. శివకుమార్‌ను కలవబోమని స్పష్టం చేశారు. ఆలోపే ముంబై కాంగ్రెస్ మాజీ చీఫ్ మిళింద్ దేవరా, ఇంకొందరు స్థానిక నేతలు హోటల్ వద్దకు చేరుకుని బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోటల్ పరిసర ప్రాంతాల్లో144 సెక్షన్ అమల్లో ఉందన్న పోలీసులు.. శివకుమార్‌తోపాటు కాంగ్రెస్, జేడీయూ నేతలందర్నీ అరెస్టు చేసి ముంబై యూనివర్సిటీ స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత వాళ్లను రిలీజ్ చేసి, బలవంతంగా బెంగళూరుకు పంపేశారు. ముంబైలో కర్నాటక మంత్రి అడ్డగింతపై సీఎం కుమారస్వామి ఫైరయ్యారు. ఎమ్మెల్యేల్ని కొనడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాల్ని మహారాష్ట్ర సర్కార్, ముంబై పోలీస్ శాఖ సపోర్ట్ చేస్తున్నాయంటూ తీవ్ర విమర్శలు చేశారు.
స్పీకర్‌పై బీజేపీ ఫిర్యాదు
ఎమ్మెల్యేల రాజీనామాల్ని ఆమోదించకుండా స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపించిందిసీఎం పదవికి కుమారస్వామి రాజీనామా చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. విధాన సౌధలోని గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. ఆ తర్వాత యడ్యూరప్ప నాయకత్వంలోని ఎమ్మెల్యేల బృందం గవర్నర్ వజూభాయ్ వాలాను కలిసి.. రాజీనామాల విషయంలో కలగజేసుకోవాలని కోరింది.
