కర్ణిసేన చీఫ్‌ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్‌

కర్ణిసేన చీఫ్‌ హత్య కేసు : ఇద్దరు షూటర్ల అరెస్ట్‌

కర్ణిసేన చీఫ్‌ సుఖ్‌దేవ్‌సింగ్‌ గొగామెడి హత్య కేసులో పోలీసులు విచారణ మరింత వేగవంతం చేశారు ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు గొగామెడిని కాల్చి చంపిన షూటర్లు ఉన్నారు. గొగామెడి హత్య కేసులో రోహిత్‌ రాథోర్‌, నితిన్‌ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లు, వారి వెంట ఉన్న మరొక వ్యక్తిని శనివారం (డిసెంబర్ 9న) రాత్రి చండీగఢ్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ, రాజస్థాన్‌ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం కర్ణిసేన చీఫ్‌ గొగామెడిని జైపూర్‌లోని ఆయన ఇంట్లోనే ముగ్గురు పాయింట్‌ బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. వీరిలో ఒక దుండగుడు స్పాట్‌లోనే క్రాస్‌ఫైర్‌ జరిగి బుల్లెట్‌ తగిలి చనిపోయాడు.

పరారీలో ఉన్న మిగిలిన ఇద్దిరని పోలీసులు తాజాగా పట్టుకున్నారు. హత్య తర్వాత ఇద్దరు షూటర్లు జైపూర్‌ నుంచి హిస్సార్‌కు రైలులో వెళ్లి అక్కడి నుంచి మనాలీ, మండి మీదుగా చండీగఢ్‌ వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య తామే చేశామని గ్యాంగ్‌స్టర్‌ రోహిత్‌ గోడారా ప్రకటించుకున్నాడు. పరారీలో ఉండి పట్టుబడ్డ ఇద్దరు షూటర్లు ఎప్పటికప్పుడు గోడారాకు టచ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

కర్ణిసేన చీఫ్‌ గొగామెడి హత్య రాజస్థాన్‌లో రాజకీయ దుమారం రేపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినందుకే ఆయనపై కాంగ్రెస్‌ పార్టీ పగ తీర్చుకుందని బీజేపీ ఆరోపించింది. గొగామెడికి ప్రాణాలకు ప్రమాదం ఉందని, సెక్యూరిటీ పెంచాల్సిందిగా కోరినప్పటికీ సీఎం అశోక్ గెహ్లాట్‌ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడమే ఇందుకు కారణమని బీజేపీ నేతలు విమర్శించారు.