
హైదరాబాద్, వెలుగు: భారతరత్న కర్పూరీ ఠాకూర్ జయంతిని బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ చీఫ్ గెస్టుగా హాజరై.. కర్పూరీ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మండల్ కమిషన్ సిఫారసులకు ముందే బిహార్ లో సీఎంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన గొప్ప నేత కర్పూరీ అని కొనియాడారు. ఠాకూర్ కు భారత రత్న ఇవ్వడం దేశంలోని ఓబీసీలకు దక్కిన గొప్ప గౌరవమన్నారు. దేశంలో ఓబీసీలకు మోదీ సర్కార్ పెద్దపీట వేస్తుందనడానికి కర్పూరీకి ఈ అవార్డు రావడమే ఒక ఉదాహరణ అన్నారు. కాగా, హైదరాబాద్ కు చెందిన ఆనంద్ గౌడ్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా బుధవారం పార్టీ స్టేట్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఆలె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.