కార్తీకమాసం మహిమాన్వితం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!

కార్తీకమాసం మహిమాన్వితం.. విశిష్టత.. ప్రాధాన్యత ఇదే..!

కార్తీక  మాసంలో ప్రతి రోజూ పుణ్యప్రదమైనదే..కార్తీక మాసమంతా నదీ స్నానాలు చేసి దేవాలయాలను దర్శించుకుంటారు. ఇంట్లో సాయంత్రం సమయంలో దీపాలు వెలిగిస్తారు. అలాగే దేవాలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఉసిరి దీపం, ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.  కార్తీకమాసానికి ఎందుకు అంత ప్రాధాన్యత.. విశిష్టత ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . 

 కార్తీక మాసం ప్రారంభమయింది.ఈ ఏడాది ( 2025)   నవంబర్​ 20 వరకు  కార్తీక మాసం కొనసాగుతుంది.  కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్’ అని స్కంద పురాణంలో కార్తీక మాస వైశిష్ట్యం గురించి పేర్కొనబడింది. అంటే  కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు’ అని అర్ధం.  ఏడాదిలో తొమ్మిదో నెలలో వచ్చే కార్తీక మాసం ఆధ్యాత్మిక సాధకులకు మోక్ష మార్గం అని పండితులు చెబుతుంటారు. 

శరదృతువులో వచ్చే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు.. కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసమని పేరు వచ్చింది. సర్వ మంగళకర మాసమైన కార్తీక మాసంలో హరిహరులను ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ మాసానికే దామోదర మాసం అని పేరు. ఈ మాసం అంతా కార్తీక దామోదర అనే నామంతో స్మరణ చేస్తారు. 

ఏం చేయాలంటే..

 కార్తీకంలో తెల్లవారుఝామునే లేచి తలారా స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి, తులసికోట ముందు భగవన్నామ సంకీర్తన చేస్తూ ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మిక పరిమళాలతో నిండి అలౌకికమైన, అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది.

 మామూలు రోజులలో భగవదారాధన మీద అంతగా శ్రద్ధ పెట్టనివారు...  గుడిలో కాలు పెట్టని వారిని సైతం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణమే గుడికి తీసుకెళ్తుంది. వారిని దేవుని ముందు కూర్చొనేలా  చేసి, పాపాలు పటాపంచలు చేసి మోక్షప్రాప్తి కలిగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

►ALSO READ | Good Sleep: మంచి ఆరోగ్యం.. మంచి నిద్ర.. ఇలా చేయండి.. బెడ్ ఎక్కడంతోనే నిద్ర ముంచుకొస్తుంది..!

కార్తీక మాస మహాత్మ్యాన్ని మొదటగా వశిష్ట మహర్షి జనక మహారాజుకు వివరించగా శౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతోపాటు, స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించాలని పండితులు చెబుతున్నారు. 

కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో నదులలో కాని.. కాలువలలో కాని  స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగ,యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావించి స్నానం చేయాలని పండితులు అంటున్నారు. 

ఉసిరి చెట్టుకింద దీపాలు వెలిగిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ మాసంలో కార్తీక వనభోజనాలు చేస్తారు. మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాలు... ఆధ్యాత్మిక నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించేదు. మీకున్న  ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.