
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం వేడుకలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. భక్తులు నెలరోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు చేయనున్నారు. ప్రతి సోమవారం స్వామికి, అనుబంధ పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు లింగార్చన నిర్వహించనున్నారు.
భక్తుల సౌకర్యార్థం ప్రతి సోమవారం ఏకదశి తిథిన సత్యనారాయణ స్వామికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కార్తీక శుద్ధ ద్వాదశి(నవంబర్ 2) రోజున రుక్మీణి విఠలేశ్వరస్వామికి పంచోపనిషత్ అభిషేకం, శ్రీ కృష్ణతులసి కల్యాణం జరపనున్నారు. నవంబర్ 4న వైకుంఠ చతుర్ధశి సందర్భంగా అనంత పద్మనాభ స్వామివారికి పంచోపనిషత్ అభిషేకం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మహా పూజ, పొన్న చెట్టు సేవ, గ్రామంలో ఊరేగింపు నిర్వహించనున్నారు.
5న కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రదోషకాల పూజ, జ్వాలా తోరణం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి నిశీపూజ చేసి రాజన్నకు మహాపూజ చేస్తారు. నెలరోజుల పాటు రాజన్న ఆలయంలోని కల్యాణ మండపంలో ప్రతిరోజు ఉదయం కార్తీక పురాణ ప్రవచనం నిర్వహించనున్నారు. నవంబర్20న కార్తీక మాసం ముగియనుంది.
శివుడి ఇష్టమైన కార్తీక మాసం
పరమశివుడికి అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతి అని ప్రతీతి. ఈ నెలలో నోములు, వ్రతాలు, శుభకార్యాలు, ఉపవాస దీక్షలు చేయడం ఎంతో శ్రేయస్సుకరమని పురోహితులు చెబుతుంటున్నారు. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో దీపారాధన చేయడం ప్రత్యేకం. శివుడికి ఇష్టమైన అభిషేకాలు, లక్షపత్రి పూజలు, కోటి బిల్వార్చన చేస్తే సకల పాపాలు తొలిగిపోతాయని అర్చకులు చెబుతుంటారు.
శ్రీమహాశక్తి దేవాలయానికి పోటెత్తిన భక్తులు
కరీంనగర్, వెలుగు: దీపావళి పర్వదినం సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీమహాశక్తి దేవాలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ధనత్రయోదశి సందర్భంగా అమ్మవార్లకు నాణాలతో పూజ, పుష్పాభిషేకం, అమ్మవార్లకు మహాభిషేకం, మంగళద్రవ్యాభిషేకం నిర్వహించారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లకు అలంకరించిన కరెన్సీ నోట్లు, గాజులు, కుంకుమ, అమ్మవారి ఫొటోలను దీపావళి లక్ష్మి కుబేర హోమం సందర్భంగా భక్తులందరికీ అందజేశారు.