కార్తీక మాసం: శివుడి దగ్గర ఉసిరికాయ దీపం ఎందుకు వెలిగించాలి.. ఎవరు ప్రారంభించారు

కార్తీక మాసం: శివుడి దగ్గర ఉసిరికాయ దీపం ఎందుకు వెలిగించాలి.. ఎవరు ప్రారంభించారు

 కార్తీకమాసం వచ్చిదంటే చాలామంది ఉసిరికాయతో దీపం వెలిగిస్తుంటారు.  ఒక్క కార్తీక మాసంలోనే ఇలా ఉసిరి దీపం వెలిగించి నీటిలో వదులుతుంటారు ఉసిరి కాయ గుండ్రంగా ఉంటుంది. దానితో దీపం ఎలా పెట్టాలి..? అనేది పెద్ద సందేహమే వస్తుంది. మరి ఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలి..ఉసిరి దీపంతో ఎటువంటి పరిహారాలు కలుగుతాయి..?  అసలు ఉసిరికాయతో దీపం వెలిగించడం ఎవరు ప్రారంభించారు? ఉసిరి దీపంతో ఎటువంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం..

కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకు వున్న సంబంధం అంతా ఇంతా కాదు. ఉసిరిచెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగానే భావిస్తారు. అంతేకాదు శివకేశవులతో పాటు బ్రహ్మ, సకల దేవతలో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు. అంతటి విశిష్టత కలిగిన ఉసిరికి కార్తీక మాసంలో చాలా  విశిష్టమైన స్థానం ఉంది. అందుకే కార్తీక మాసంలో మరీ ముఖ్యంగా దశమి, ఏకాదశి, సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి కాయ దీపం వెలిగిస్తే గొప్ప ప్రయోజనాలు కలుగుతాయట.

 కార్తీక మాసం అంటే దీపాలు ప్రధానమైనవి. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు. వేకువ జామునే లేచి చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించేవే. కానీ కార్తీక మాసంలో ‘ఉసిరి దీపాలు’లకు విశిష్టత ఉంది. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనాలు చేస్తే మంచిదని అందరికి తెలుసు..కానీ ఉసిరి కాయ (రాసి ఉసిరి అంటే పెద్ద ఉసిరి)తో దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయని..నవ గ్రహ దోషాల పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదు. 

ఉసిరిచెట్టు కింద దీపం వెలిగించాడానికి ఓ పురాణ గాథ కూడా ఉందని వశిష్ఠ మహాముని శౌనకాది మునులకు వివరించాడు. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు కార్తీకమాసంలో  శివుడికి పూజ చేయాలనుకున్నారు.  కాని అక్కడ శివాలయం కాని.. శివలింగం కాని లేదట.  ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ద్రౌపది శ్రీకృష్ణుడు ఇలా ఉపదేశించాడట.  ఇప్పుడు కార్తీకమాసం..  నిన్ను.. నీభర్తలను కొన్ని గ్రహాల దోష ఫలితాల కారణంగా జూదంలో ఓడిపోయి.. ఇలా అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. కార్తీకమాసంలో ఉసిరికాయ.. ఆవునెయ్యితో దీపం పెడితే నవగ్రహ దోషాలకు పరిహారం కలుగుతుందని చెప్పాడని  పద్మ పురాణంలో పేర్కొన్నారు.  అప్పుడు ద్రౌపది.. గుండ్రంగా ఉసిరికాయ పై భాగం తీసి.. దానిలో ఆవునెయ్యి, తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేసిందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.   ఆ తరువాత ఉసిరిచెట్టు కిందనే భోజనాలు చేసిన తరువాతనే ధర్మరాజు యుద్దానికి ఒప్పుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.  ఇలా ఉసిరిదీపం వెలిగించిన.. తరువాత  వారికి గ్రహదోషాలు తొలగి మళ్లీ రాజ్యం వచ్చేందుకు బీజం పడిందని పండితులు చెబుతున్నారు.  

కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను తీసుకుని, దాని మద్యలో గుండ్రంగా కట్ చేస్తే..దీపంలో తయారవుతుంది. ఆ బెజ్జంలో నెయ్యి నింపి దాంట్లో తామర కాడల వత్తులను వేసి దీపం వెలిగించాలి. ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు. సకల ఐశ్వర్యాలతో పాటు మహిళలు సుమంగళిగా మరణిస్తారని అంటారు. 

ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. అందుకే కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించిన వారికి లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు, ఈశ్వర అనుగ్రహం లభిస్తుందంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే.. నవగ్రహ దోషాలతో పాటు సకలదోషాలు తొలగిపోతాయని..ఇంటికి నరదిష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.