గంటకు 153KM వేగంతో బంతులు: దేశవాళీ బ్యాటర్లను భయపెడుతున్న 22 ఏళ్ల బౌలర్

గంటకు 153KM వేగంతో బంతులు: దేశవాళీ బ్యాటర్లను భయపెడుతున్న 22 ఏళ్ల బౌలర్

టీమిండియాలో మరో ఫాస్ట్ బౌలర్ దూసుకొస్తున్నాడు. పట్టుమని పాతికేళ్ళు లేకుండానే బుల్లెట్ లాంటి బంతులను ప్రత్యర్థులకు విసురుతున్నాడు. వేగంతో పాటు ఖచ్చితత్వంతో బంతులేస్తూ ఫ్యూచర్ ఇండియన్ స్టార్ గా మారుతున్నాడు. గంటకు 152, 153 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తూ అక్తర్, బ్రెట్ లీ లాంటి దిగ్గజాలను నేటి తరానికి గుర్తు చేస్తున్నాడు. ఇంతకు ఆ బౌలర్ ఎవరో కాదు ఐపీఎల్ లో సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన కార్తీక్ త్యాగి. 
          
కార్తీక్ త్యాగి.. ఈ పేరు క్రికెట్ లో చాలా కొద్దిమందికే తెలుసు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈ  స్పీడ్‌స్టర్ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ T20 ట్రోఫీలో ఆడుతున్నాడు. తాజాగా ఉత్తర ప్రదేశ్, గుజరాత్ జట్ల మధ్య జరిగిన  క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో 152,153 kph డెలివరీలు విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.  క్రమం తప్పకుండా నిలకడగా 150kph వేగంతో బంతులు వేయడం గమనార్హం. త్యాగి వేసిన  వేగవంతమైన డెలివరీకి పీయూష్ చావ్లా హెల్మెట్‌పై బలంగా తాకింది. దీంతో కాస్త ఈ సీనియర్ స్పిన్నర్ కాసేపు అసౌకర్యంగా కనిపించాడు. 

ఇక ఈ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్ (3/21), త్యాగి (1/27) విజ్రంభించడంతో గుజరాత్ 20 ఓవర్లలో 127/8కే పరిమితమైంది. ప్రస్తుతం కార్తిక్ పేస్ బౌలింగ్ దేశవాళీ క్రికెట్ లో బ్యాటర్లను భయపెడుతుంది. ఐపీఎల్ లో రాజస్థాన్ తరపున కొన్ని మ్యాచ్ లాడిన త్యాగి.. పర్వాలేదనిపంచాడు. ఆ తర్వాత తిరిగి సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన ఈ యంగ్ బౌలర్.. ఆడిన కొన్ని మ్యాచ్ ల్లో విఫలమయ్యాడు. అయితే తాజాగా తన బౌలింగ్ మరింత పదునుగా మారడంతో భారత జట్టులో స్థానం సంపాదించిన ఆశ్చర్యం లేదు.