బహిరంగ చర్చకు సిద్ధమా.. నిరంజన్ రెడ్డికి కాసాని జ్ఞానేశ్వర్ సవాల్

బహిరంగ చర్చకు సిద్ధమా.. నిరంజన్ రెడ్డికి కాసాని జ్ఞానేశ్వర్ సవాల్

తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. బియ్యం గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని చెప్పారు. చంద్రబాబు ఒక్క మీటింగ్ పెడితే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఎన్టీఆర్ పాలనకు ముందు దొరలకు కూడా తినేందుకు బియ్యం దొరకలేదని గుర్తు చేశారు. దొడ్డు వడ్లు, గటుకు తినే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్టీఆర్ పాలన మొదలైందని చెప్పారు. చంద్రబాబును విమర్శించే వాళ్లు స్క్రిప్ట్ చదువుడు మానేస్తే బాగుటుందని మంత్రి నిరంజన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఎవరి పాలనలో అన్యాయం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. 

కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకు పంపిణీ చేయడం లేదని కాసాని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. నిరంజన్ రెడ్డి ఏరియా నుంచి ఇంకా వలసలు కొనసాగుతున్నాయని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డితో తాను డిబేట్‭కు సిద్ధమని సవాల్ చేశారు . ఆహార భద్రత అనేది టీడీపీ వచ్చిన తరువాతే లభించిందనేని వాస్తవం కాదా అని ప్రశ్నించారు.