Japan Kumar Viral Video: హోటల్లో సర్వర్గా విజయ్ కో స్టార్.. వైరల్ వీడియోపై జపాన్ కుమార్ భార్య క్లారిటీ

Japan Kumar Viral Video: హోటల్లో సర్వర్గా విజయ్ కో స్టార్..  వైరల్ వీడియోపై జపాన్ కుమార్ భార్య క్లారిటీ

తమిళ నటుడు, డ్యాన్సర్ జపాన్ కుమార్ (Japan Kumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 90వ దశకంలో సినీ ప్రేక్షకులకు ఆయన ఎంతో దగ్గరయ్యారు. తన డ్యాన్స్‌, హావభావాలు, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అలాంటి జపాన్ కుమార్ చెన్నైలోని ఓ చిన్న ఫుడ్ స్టాల్‌లో పనిచేస్తున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆయన, ఇప్పుడు ఇలాంటి దయనీయ పరిస్థితిలో ఉన్నారా? అంటూ నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు.

అయితే ఈ వైరల్ వీడియోపై జపాన్ కుమార్ భార్య జ్యోతి కుమార్ స్పందించారు. ఆ ఫుడ్ స్టాల్ తమది కాదని, అది జపాన్ కుమార్ సోదరుడిదని ఆమె తెలిపారు. షూటింగ్స్ లేని సమయంలో ఆయన అక్కడ సహాయం చేస్తారని, ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ఆర్థిక లేదా వ్యక్తిగత సమస్యలు లేవని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

అసలేం జరిగిందంటే:

చెన్నైలోని వడపళణిలో ఉన్న ‘శక్తి వీట్టు సాపాడు’ ఫుడ్ స్టాల్‌లో జపాన్ కుమార్ కస్టమర్లకు భోజనం వడ్డిస్తున్న వీడియో వైరల్ అయింది. సాధారణ టీషర్ట్, కళ్లజోడుతో కనిపించిన ఆయన వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, రెడిట్ వంటి ప్లాట్‌ఫామ్‌ల్లో వేగంగా వ్యాపించింది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో అవకాశాలు తగ్గడంతో ఆయన ఇబ్బందులు పడుతున్నారనే ప్రచారం మొదలైంది.

►ALSO READ | 15 రోజుల్లోనే రూ.4,350 కోట్లు.. ‘మైఖేల్’ బాక్సాఫీస్ రికార్డుల వేట.. ఫ్యాన్స్‌లో పూనకాలు!

1990లు, 2000లలో తనదైన ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న జపాన్ కుమార్‌ను ఇలా చూడటం బాధాకరమని కొందరు కామెంట్లు చేశారు. అయితే మరికొందరు మాత్రం “కుటుంబ వ్యాపారంలో సహాయం చేయడం తప్పేంటి?”, “ప్రతి పనికీ గౌరవం ఉంటుంది” అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు.

ఈ నేపథ్యంలోనే జపాన్ కుమార్ భార్య జ్యోతి కుమార్ స్పందించారు. ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “ఆ ఫుడ్ స్టాల్ జపాన్ కుమార్‌ది కాదు, ఆయన సోదరుడిది. షూటింగ్స్ లేని సమయంలో ఆయన అక్కడ సహాయం చేస్తుంటారు. అలాంటి సమయంలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు” అని క్లారిటీ ఇచ్చారు. యూనియన్ నిబంధనల కారణంగా జపాన్ కుమార్ స్వయంగా స్పందించలేకపోయారని కూడా ఆమె తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలకు తెరపడింది.

జపాన్ కుమార్ విషయానికి వస్తే.. విజయ్, అజిత్ కుమార్, శింబు, ఆర్ మాధవన్ వంటి స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సినిమాలు చేశారు. సామీ, పోకిరి, వరలారు, వీరం, గుర్ఖా వంటి సినిమాల్లో తనదైన శైలిలో మెప్పించారు. అలాగే ప్రభుదేవా, రాజు సుందరం, రాఘవ లారెన్స్ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్లతో కూడా పనిచేశారు.