
ఆయన పేరు ఆసిఫ్ జర్గార్. శ్రీనగర్‌లోని నొహత్తాలో ఉంటాడు. రోజూ స్కూల్ కాగానే డ్యూటీ ఎక్కేవాడు. వీధుల్లోకి వచ్చి నలుగురిని పోగేసుకొని రాళ్లు విసరడమే ఆ డ్యూటీ. ఎక్కడ ధర్నా, ఆందోళన జరిగినా అక్కడ వాలిపోయి భద్రతా బలగాలపై రాళ్లేసి చటుక్కున మాయమైపోయేవాడు. అందుకే ఆయనకు ఫ్రెండ్స్ పెట్టిన పేరు హర్తాళ్! కానీ ఆ యువకుడు ఇప్పుడు రాళ్లను వదిలి రాజకీయాల వైపు చూస్తున్నాడు. రాళ్లేసిన చోట ఓట్లడిగేందుకు సిద్ధమయ్యాడు. ఇండిపెండెంట్ గా లోక్‌సభకు పోటీ చేస్తానంటున్నాడు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
ఆసిఫ్ స్కూల్లో చదివే రోజుల్లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ . 2007 నుంచి 2010 వరకు కాశ్మీర్ పోలీసులకు అతడో సవాల్ . 2007లో కాశ్మీర్‌లో అల్లర్లు ఎక్కువగా జరిగేవి. ఆ అల్లర్లలో ఉన్నట్టుండి ఓ గ్యాంగ్ ప్రత్యక్షమయయ్యేది. బలగాలపైకి ఎడాపెడా రాళ్లు విసిరి వీధుల్లోకి వెళ్లి నిమిషాల్లోనే పరారయ్యేది. వారిని పట్టుకునేందుకు పోలీసులు నానా తిప్పలు పడేవారు. ఆ గ్యాంగ్ లీడర్ ఆసిఫే. కొన్నిసార్లు పట్టుబడడం జైలుకు వెళ్లి రావడం, మళ్లీ చేతిలో రాళ్లు పట్టుకోవడం అతడికి అలవాటుగా మారిపోయింది. అలాంటిది సడన్ గా 2018 స్థానిక ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. ‘‘ఇప్పుడు నేను లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేద్దామనుకుంటున్నాం. నేను రెండు జీవితాలు చూశాను. నన్ను రాళ్లు వేసేందుకు ప్రోత్సహించిన ఫ్రెండ్స్ గురించి తెలుసు. ఇప్పుడు జనంతో మమేకమవుతున్నా . నాకో ఛాన్స్ ఇస్తే యూత్ ను మార్చేందుకు కృషి చేస్తా. తప్పుడు నిర్ణయాలు ఎటు దారితీస్తాయో చెబుతా. ప్రజల కోసమే పోరాడుతున్నామని వారనుకుంటారు. కానీ వాస్తవం అలా ఉండదు. ప్రజలు వారిని క్రిమినల్స్ మాదిరి చూస్తారు’’ అని ఆసిఫ్ పేర్కొన్నాడు.
ఫ్రెండ్ మరణంతో రాయి పట్టా ..
పోలీసు కాల్పుల్లో ఫ్రెండ్ మరణించడంతో బలగాలపై కోపంతో రాళ్లు పట్టానని ఆసిఫ్ చెప్పా డు. ‘‘నా తండ్రి ఉమర్ ముజాహిద్దీన్ సంస్థలో సభ్యుడిగా ఉండేవాడట. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆయన పోలీసుల కాల్పుల్లో చనిపోయాడట. తర్వాత మేం మా మేనమామ ఇంటికి వెళ్లాం. అక్కడ మమ్ముల్ని వారు బాగా చూసుకునేవారు. నన్ను మదర్‌ల్యాండ్ హైస్కూల్ లో చేర్పించారు. తర్వాత కొన్నాళ్లకు నన్ను మామ ఇంట్లోనే ఉంచేసి అమ్మ వేరే పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. అదే టైంలో మరో ఘటన నా మనసును కలచి వేసింది. ఓ నా ఫ్రెండ్ ముంతాజిర్‌తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నా. దగ్గర్లో ఓ ర్యాలీ జరుగుతోంది. ఇంతలో ముంతాజిర్ కింద పడిపోయాడు. ఏమైందని చూస్తే కడుపులోంచి రక్తం కారుతోంది. పోలీసుల తూటా తగిలింది. కాసేపటికి అక్కడ కొందరు పోగయ్యారు. నా కళ్ల ముందే ముంతాజిర్ కన్నుమూశాడు. సాయంత్రం అతడి ఇంటికి వెళ్లా. వాళ్ల అమ్మ గుండెలవిసేలా ఏడ్చింది. ఇది నన్ను చాలా బాధపెట్టింది. నా కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో తెలియలేదు. ఎవరితో మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాలేదు. నాలో నేనే సంఘర్షణకు లోనయ్యా. అప్పుడే రాయి పట్టుకున్నా . బలగాలపైకి రాయి విసిరి ఒకరు గాయపడేలా చేస్తే నా కోపం కాస్త చల్లారేది. మెల్లగా ఇదే అలవాటుగా మారింది. మా మేనత్త మా అమ్మను పిలిచి మందలించింది. నేను చేస్తున్న పనుల గురించి చెప్పింది. అయినా అప్పుడు ఎవరి మాట విన్లేదు ’’ అని ఆసిఫ్ వివరించాడు. అప్పట్నుంచి రోజూ అమ్మ మేనమామ ఇంటికి వచ్చి తనను ఓ కంట కనిపెడుతూ ఉండేదని చెప్పాడు.
అమ్మ బాధ చూడలేక మారా..
‘‘మొదటిసారి 2008లో పోలీసులు నన్ను పట్టుకున్నారు. స్టేషన్ లో మూడ్రోజులు పెట్టారు. నా బట్టలు తీసేసి స్టేషన్ బయట వేలాడదీశారు. మా అమ్మ, మామను పిలిపించి నన్ను చూపించారు. వాళ్లు ప్రాథేయపడడంతో వదిలిపెట్టారు. 2009లో ఫ్రెండ్స్‌తో కలిసి పోలీస్ స్టేషన్ పైకి దాడికెళ్లా. అప్పుడు ఓ తూటా నా చెంపను రాసుకుం టూ దూసుకెళ్లింది. 2010లో పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. అమ్మ నన్ను చూసేందుకు స్టేషన్ కు వచ్చింది. నన్ను విడిచిపెట్టాలంటూ పోలీసుల కాళ్లపై పడి ఏడ్చింది. ఎవరూ పట్టించుకోలేదు. నా గురించి జనం ఏమనుకుంటున్నారని అడిగా.. ‘హర్తాల్ మళ్లీ జైలుకు వెళ్లాడట. మంచి పనైంది. మా పిల్లలు వాడి వల్ల చెడిపోతున్నారు’ అని అనుకుంటున్నట్టు చెప్పింది. దాంతో నాలో మార్పు వచ్చింది. 15 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యా . శ్రీనగర్‌లో బీకాం పూర్తి చేశా’’ అని ఆసిఫ్ చెప్పాడు.