తీన్ దిన్ కా మామ్లా.. కేజీబీవీ నియామకాల్లో కొత్త కిరికిరి

తీన్ దిన్ కా మామ్లా.. కేజీబీవీ నియామకాల్లో కొత్త కిరికిరి
  • తీన్ దిన్ కా మామ్లా
  • కేజీబీవీ నియామకాల్లో కొత్త కిరికిరి
  • మొన్న రిజల్ట్స్, నిన్న వెరిఫికేషన్
  • ఇయ్యాళ్ల లిస్ట్.. రేపు జాయినింగ్
  • సెలవు దినాల్లోనే ఖేల్ ఖతం
  • అధికారులకు ఎందుకంత ఆగం?

హైదరాబాద్: కస్తూర్బా గాంధీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల(యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రకియ విచిత్రంగా సాగుతోంది. కేవలం మూడు రోజుల్లోనే అది కూడా సెలవు దినాల్లోనే కంప్లీట్ చేసేందుకు అధికారులు కొత్త ప్లాన్ వేసి అమలు చేస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్షా ఫలితాలు రిలీజ్ చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్​ కు రావాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.

వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియ మమ అనిపించి, ఇవ్వాల ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్ట్ అయినవారు రేపు(ఆదివారం) జాయిన్ కావాలని ఆదేశాలిచ్చారు. ఫలితాలే చూసుకోక ముందు...రెండ్రోజుల్లోనే ప్రక్రియంతా ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు.రాష్ట్రంలోని కేజీబీవీ, యూఆర్ఎస్ ల్లో ఖాళీగా ఉన్న 1241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24,25,26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్​లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది అప్లై చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. 

పరీక్షల నిర్వహణ టైమ్​లో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యధాతథంగా నిర్వహించారు. గురువారం రాత్రి 8 గంటల నుంచి 12 గంటల మధ్య మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు డీఈవో ఆఫీసుల్లోని సిబ్బంది ఫోన్లు చేశారు. వీరిలో చాలామంది తీయలేదనీ సిబ్బంది వాపోయారు. ఉదయం 10గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని డీఈవో ఆఫీసుల్లోని సిబ్బందే చెబుతున్నారు. 

సర్టిఫికేట్లు ఒక చోట..తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికేట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొదరు వారికి సమాధానం చెప్పినా ఫోన్లు చేసిన సిబ్బంది పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేనని గద్దించారని పలువురు అభ్యర్థులు అంటున్నారు. ఇందులో కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికేట్లు పెట్టుకోవాలనీ ఎస్​ఎస్​ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా భర్తీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం సర్టిఫికేట్ల వెరిఫికేషన్​కు వన్ వీక్ టైమ్ ఇవ్వాల్సి ఉంటుంది. 

మరోపక్క ఈ సెలక్షన్ కమిటీకీ చైర్మన్ కలెక్టర్, వైస్ చైర్మన్ గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. ఈ తతంగం వెనుక ఎవరున్నారు..? ఎందుకు అంత ఆగమాగం చేస్తున్నారనేది అభ్యర్థుల్లో హాట్ టాపిక్ గా మారింది.