కౌన్ బనేగా కరోడ్‌పతి14వ సీజన్ కొత్తగా ఉండబోతోంది. కారణం... ఈసారి ప్రైజ్‌మనీని పెంచడమే. ఇంతకుముందు సీజన్స్‌లో కోటి రూపాయలు గెలుచుకున్నాక ఏడున్నర కోట్ల ప్రశ్న అటెంప్ట్ చేయడానికి కంటెస్టెంట్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించేవాళ్లు. కారణం... తప్పు సమాధానం చెప్తే రూ. 3.20 లక్షలకు పడిపోవడమే. దాంతో కంటెస్టెంట్స్ రిస్క్ తీసుకునేవాళ్లు కాదు. అయితే ఈ సీజన్లో కంటెస్టెంట్స్ రిస్క్ తీసుకున్నా పెద్దగా నష్టపోరు. ఎందుకంటే.. ఏడున్నర కోట్ల ప్రశ్నకు తప్పుగా సమాధానం చెప్పినా 75 లక్షల రూపాయల ప్రైజ్మనీ గెలుచుకోవచ్చు. అదెలాగంటే... మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఆగష్టు 15కి 75 ఏండ్లు అవుతుంది. ఈ సందర్భంగా కేబీసీ స్పెషల్ జాక్‌పాట్ ప్రైజ్ అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోని సోని టీవీ రిలీజ్ చేసింది. అందులో... హోస్ట్ అమితాబ్ బచ్చన్ కోటి రూపాయలు గెలిచిన కంటెస్టెంట్‌ని ‘ఇంకా ఆడతారా?’ అని అడుగుతాడు. తర్వాతి ప్రశ్నకు వెళ్లడం ఇష్టం లేదన్నట్టుగా చూస్తాడు అతను. ‘ఏడు కోట్ల ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకున్నా 75 లక్షలు గెలుస్తారు’ అని చెప్పడంతో ఆ కంటెస్టెంట్ ముఖం నవ్వుతో వెలిగిపోతుంది. ఈ షో త్వరలోనే సోనీ టీవీలో టెలికాస్ట్ కానుంది.
