
బాధిత కుటుంబానికి ఓబీసీ జాతీయ కమిటీ సభ్యుడు ఆచారి పరామర్శ
హన్మకొండలో అత్యాచారం, హత్యకు గురైన 9 నెలల చిన్నారి కుటుంబానికి పరామర్శలు కొనసాగుతున్నాయి. జాతీయ ఓబీసీ కమిషన్ మెంబర్ ఆచారి, వరంగల్ ఎంపీ దయాకర్ , ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ దయానంద్ , బీజేపీ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నటుడు కౌషల్.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చిన్నారిపై దాడి చేసిన నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తామన్నారు ఎంపీ దయాకర్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఈ సంఘటనను రాజకీయం చేయొద్దని కోరారు. హోంమంత్రి మహమ్మద్ అలీ, కేటీఆర్ తో చిన్నారి కుటుంబ సభ్యులను మాట్లాడించామన్నారు. అధైర్య పడవద్దని, అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు నేతలు.
చిన్నారి హత్య కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు ఓబీసీ జాతీయ కమిటీ సభ్యుడు ఆచారీ. ఈ ఘటనపై దేశంలోని ప్రజలందరు నిరసనలు వ్యక్తం చేసారన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు పాల్పడిన ప్రవీణ్ కు మరణశిక్ష పడేలా బీసీ కమిషన్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు.
ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు నటుడు కౌషల్. రాష్ట్రంలో వారం రోజుల్లోనే ఆరుగురిపై అత్యాచారాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలతో ఆడ పిల్లల పేరెంట్స్ ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. చిన్నారి కేసులో నిందితుడిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగకపోతే.. దీక్ష చేస్తానన్నారు కౌశల్.
పాప చనిపోయిన 11వ రోజు లోపైనా న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు.