V6 News

బూర్జువా పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రండి :  కవిత

బూర్జువా పార్టీలను వదిలి కొత్త పార్టీలోకి రండి :  కవిత
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపు 
  • మా పార్టీలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని వెల్లడి 

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ రాజకీయాల్లో కొత్త కుంపటి సెగలు పుట్టిస్తున్నది. ‘‘బూర్జువా పార్టీలను వదిలిపెట్టి కొత్త పార్టీలోకి రావాలి.. ఉద్యమకారులందరూ ఏకం కావాలె" అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. తనతో కలిసి నడిచేందుకు చాలా జిల్లాల నుంచి లీడర్లు, ఉద్యమకారులు సిద్ధంగా ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేసిన్రు.

ఆదివారం హైదరాబాద్‌‌లో మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తన అనుచరులతో కలిసి కవిత సమక్షంలో జాగృతి కండువా కప్పుకున్నరు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 2006లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం రోజులు ఉండి హెల్త్ క్యాంపులు పెట్టానని గుర్తుచేశారు. రాథోడ్ బాపూరావు తన ఉద్యోగాన్ని వదిలేసి మరీ తెలంగాణ కోసం కొట్లాడారని, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు.

సిరిసిల్ల  నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున జాగృతిలో చేరేందుకు రెడీగా ఉన్నారని అన్నారు.  స్వరాష్ట్రం కోసం కొట్లాడినోళ్లకు కొత్త పార్టీనే అసలైన వేదిక అని చెప్పారు. రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ  తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా గానీ.. మధ్యలో వచ్చినోళ్లకు మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపించారు.

మూడోసారి టికెట్ కూడా ఇవ్వలేదన్నారు.  తెలంగాణ రాష్ట్రానికి కవితమ్మ సీఎం కావాలని ఆకాంక్షించారు. కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇచ్చోడలో భారీ బహిరంగ సభ పెట్టి, తన కార్యకర్తలందరినీ పార్టీలో చేరుస్తానని ఆయన ప్రకటించారు.