కవితకు ఈడీ నోటీసులు వచ్చినా రియాక్ట్​ కారా అంటూ సీఎం ఆగ్రహం

కవితకు ఈడీ నోటీసులు వచ్చినా రియాక్ట్​ కారా అంటూ  సీఎం ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు:  కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినా సరిగా రియాక్ట్​కారా? అంటూ ఇద్దరు మంత్రులపై కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్టు తెలిసింది. కవితకు సమన్లు ఇచ్చినా పట్టనట్టు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. ఇంకోసారి ఇలాంటి ఉదాసీనతను సహించేది లేదని.. మళ్లీ రిపీట్​అయితే చర్యలు తప్పవని హెచ్చరించినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్టు సమాచారం. అధికారిక అంశాలపై చర్చ తర్వాత ఢిల్లీ లిక్కర్​స్కాంను కేసీఆర్ ​ప్రస్తావించినట్టు తెలిసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలపై ఏజెన్సీలను ఎలా ప్రయోగిస్తున్నదో కేసీఆర్ వివరించినట్టు సమాచారం.

బీజేపీపై ఎలాంటి పోరాట పంథా చేపట్టాలనే దానిపై శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశంలో దిశానిర్దేశం చేస్తానని చెప్పినట్టు తెలిసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ అక్టోబర్​లోనే వస్తుందని, నవంబర్​లో ఎన్నికలు ఉంటాయని.. అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపైనా పార్టీ మీటింగ్​లోనే మాట్లాడుదామని సూచించినట్టు సమాచారం. ఒక వివాహానికి హాజరుకావాల్సి ఉండటంతో మంత్రి పువ్వాడ అజయ్.. ఢిల్లీలో కవిత దీక్షలో పాల్గొనడానికి వెళ్లేందుకు మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి.. సీఎం పర్మిషన్​ తీసుకొని కేబినెట్​మీటింగ్ మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు.