జూన్ 2న కవిత కొత్త పార్టీ! : ఎంపీ రఘునందన్ రావు 

జూన్ 2న కవిత కొత్త పార్టీ! : ఎంపీ రఘునందన్ రావు 

తూప్రాన్, వెలుగు: జూన్ 2న బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పదేండ్లు దయ్యాల మధ్య కవిత ఎందుకు రాజకీయాలు చేశారని నిలదీశారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో మంగళవారం రఘునందన్ రావు  పోస్ట్ ఆఫీస్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు.  1,200 మంది యువకులు అమరులై వచ్చిన తెలంగాణలో ఒక్క కుటుంబం మాత్రమే ఫలితం అందుకుందన్నారు.

పదేండ్ల పాలనతో విసిగిపోయిన ప్రజలు గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చుండబెడితే.. ఒకరినొకరు తిట్టుకుంటున్నారని అన్నారు. పదేండ్లు లేనిది ఇప్పుడు తండ్రికి, బిడ్డకు మధ్య మధ్యవర్తులు ఎందుకొచ్చారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో షర్మిలలాగా పాదయాత్ర చేసేందుకు కవిత సిద్ధమయ్యారని తెలిపారు.  చెల్లెలు కొత్త పార్టీ పెట్టుకుంటే ఏం జరిగిందో పక్క రాష్ట్రంలో చూశామని.. ఇక్కడ కూడా అదే జరుగుతుందన్నారు.

సామాజిక తెలంగాణ అని, మహిళలకు అన్యాయం జరిగిందని కవిత మాట్లాడుతుంటే బాధనిపిస్తోందన్నారు. తండ్రి కేబినెట్లో మహిళలను మంత్రి పదవి ఇవ్వకపోతే కవిత మాట్లాడలేదని, ఇప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుందనడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ అయిన ఈటల రాజేందర్ ను పదవి నుంచి తొలగిస్తే మాట్లాడలేదన్నారు. అధికారంలో ఉన్న పదేండ్లు పట్టించుకోకుండా ఇప్పుడు పూలే విగ్రహం పెట్టాలని  అన్ని పార్టీలను కలుస్తున్నారన్నారు.