25 వేల మంది బీసీలు .. ప్రజాప్రతినిధులయ్యేదాకా పోరాటం: కవిత

25 వేల మంది బీసీలు .. ప్రజాప్రతినిధులయ్యేదాకా పోరాటం: కవిత

హైదరాబాద్, వెలుగు: వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు 25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యేదాకా పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌‌‌‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. 25 వేల మంది బీసీలకు పదవులు దక్కితే.. అందులో సగం ఆడబిడ్డలకే వస్తాయని తెలిపారు. బుధవారం బంజారాహిల్స్‌‌లోని​తన నివాసంలో యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌‌లో ఇచ్చిన హామీలని అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. 

ఇప్పటి వరకు రాజకీయంగా అవకాశం దక్కని కులాలకు రాజకీయ రిజర్వేషన్ల ఫలాలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం ఎంత ముఖ్యమూ అందులో సబ్ కోటా కల్పించడం కూడా అంతే ముఖ్యమన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ కేబినెట్ చేసిన సవరణ తీర్మానం గవర్నర్ వద్ద పెండింగ్‌‌లో ఉందని, దానికి వెంటనే ఆమోదముద్ర వేసి గెజిట్ జారీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.