
నిజామాబాద్ లోక్ సభ ఎన్నికలో ఓటమిపై మాజీ ఎంపీ కవిత స్పందించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. చనిపోయిన టీఆర్ఎస్ కార్యకర్త కిశోర్ కుటుంబసభ్యులను ఆమె పరామర్శించారు. ఎన్నికల ఫలితాలతో కలత చెంది.. గత 3 రోజులుగా మనస్తాపానికి లోనై ఇవాళ హార్ట్ ఎటాక్ తో కిశోర్ చనిపోయాడనీ.. ఆయన కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె చెప్పారు.
ఓటమిపై స్పందిస్తూ…
“తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు ఓ విషయం చెబుతున్నా. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు ఉంటాయి. ఒడిదొడుకులు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ అనేది… పదవుల కంటే ఎక్కువగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసే పార్టీ. పదవులు ఉన్నా లేకపోయినా… ప్రజల కోసం పనిచేయాలి. నాది నిజామాబాదే. నిజామాబాద్ లోనే ఉంటాను. నిజామాబాద్ వదిలిపెట్టి పోయేది లేదు. తెలంగాణ కోసమైనా.. నిజామాబాద్ కోసమైనా.. కార్యకర్తలు, ప్రజల కోసమైనా.. పదవిలో ఉన్నా లేకున్నా.. తప్పకుండా పనిచేస్తా” అన్నారు కవిత.
కేంద్రంలో బీజేపీ రావాలనే వారికి ఓటేశారు
“మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కాదని.. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆశతో బీజేపీ పట్ల మొగ్గు చూపించారు. మొన్నటి ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీపైన అనేక మైన ఆశలు ప్రజలు పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. నిజామాబాద్ లో ఉండేటువంటి ప్రత్యేకమైన ఆకాంక్షలను కొత్తగా ఎన్నికైన ఎంపీ నెరవేర్చాలని ఆశిస్తున్నాం. పదవులు ఉన్నా లేకున్నా.. టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర బాగు కోసం పనిచేసే వ్యక్తిని నేను. కేడర్ ధైర్యం కోల్పోవద్దు. ఓటమిలో హుందాగా ఉండాలనేది తెలంగాణ ఉద్యమమే మనకు నేర్పించింది” అంటూ ముగించారు కవిత.