తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు.. నాగార్జున సాగర్కు లక్షకు పైగా క్యూసెక్కుల వరద

తెరుచుకున్న శ్రీశైలం డ్యామ్ క్రస్ట్ గేట్లు.. నాగార్జున సాగర్కు లక్షకు పైగా క్యూసెక్కుల వరద
  • సాగర్ లో 532 అడుగులకు నీటిమట్టం 
  • ఎడమ కాల్వ ఆయకట్టులో రైతుల్లో ఆనందం

హాలియా, వెలుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగార్జున సాగర్ జలకళను సంతరించుకుంటోంది. సాగర్ కు ఎగువన కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. మంగళవారం మధ్యాహ్నం శ్రీశైలం డ్యామ్ 4 క్రస్ట్ గేట్ల ద్వారా కుడి , ఎడమ విద్యుత్ ఉత్పత్రి కేంద్రాల నుంచి దిగువకు లక్షా 14 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భారీగా వరద వస్తుండడంతో సాగర్ లో గంట గంటకు నీటిమట్టం పెరుగుతోంది.  సాగర్ లో గరిష్ట స్థాయి నీటిమట్టం 590 అడుగులు(312.040 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 532 అడుగులకు(172.0760  టీఎంసీలు) చేరింది. ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు పాలేరు రిజర్వాయర్ ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3,090 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

కాగా హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు ఏఎమ్మాఆర్పీకి 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా ఇన్ ఫ్లోగా 1,14,146 క్యూసెక్కులు ఉంది. ఔట్ ఫ్లో 4,590  క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. సాగర్ కు ఎగువన నుంచి వరద ప్రవాహం వస్తుండగా..  ఎడమ కాల్వ ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.  గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి భారీ వర్షాల కారణంగా ముందస్తుగానే జులై తొలివారంలోనే వరద వస్తుంది. దీంతో ఎడమకాల్వ ఆయకట్టుకు ముందుగానే నీటిని విడుదల చేసే చాన్స్ ఉంది.  ఇప్పటికే ఆయకట్టు ప్రాంతంలో బోర్లు, బావులు కింది రైతులు వరి నార్లు పోస్తున్నారు.