కల్వకుర్తి లిఫ్ట్ నుంచి నీటి విడుదల.. ఎల్లూరు పంప్హౌస్లో మోటా‌ర్ ఆన్ చేసిన మంత్రి జూపల్లి

కల్వకుర్తి లిఫ్ట్ నుంచి నీటి విడుదల.. ఎల్లూరు పంప్హౌస్లో మోటా‌ర్ ఆన్ చేసిన మంత్రి జూపల్లి
  • జులై రెండో వారంలోనే నీటిని వదలడంతో ఆయకట్టు రైతుల్లో హర్షం 
  • పాలమూరు ప్రాజెక్టులను గత సర్కారు  నిర్లక్ష్యం చేసింది: మంత్రి జూపల్లి
  • కనీసం కాలువలకు కూడా లైనింగ్​ చేయలేదని ఫైర్​

కొల్లాపూర్, వెలుగు: మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల కింద ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. మంగ‌ళ‌వారం నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా ఎల్లూరు గ్రామంలోని రేగుమాన్ గ‌డ్డ వ‌ద్ద ఎల్లూరు పంప్ హౌస్‌లో రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు మోటార్‌ను స్విచాన్​ చేసి నీటిని వదిలారు. కల్వకుర్తి లిఫ్ట్​ స్కీమ్‌లో భాగంగా ప్యాకేజీ 28, 29 , 30 కింద ఉన్న ఎల్లూరు, సింగోటం, జొన్నల బొగుడ‌, గుడిప‌ల్లి, గ‌ట్టు జ‌లాశ‌యాల‌ను నింపి ఆయ‌క‌ట్టుకు నీళ్లివ్వనున్నారు. గతానికి భిన్నంగాఈసారి శ్రీశైలానికి ముందే వరద వచ్చింది. దీంతో రెండు వారాల ముందుగానే కల్వకుర్తి కింద సాగునీరు విడుదల చేయగా.. ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. నిరుడు జులై 30న కల్వకుర్తి లిఫ్ట్​నుంచి సాగునీరు విడుదల చేశారు. కాగా,  ఈ స్కీమ్​ కింద 4.5లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. 

కాగితాలపైనే ఆయకట్టు పెంచిన్రు: మంత్రి జూపల్లి
గ‌‌‌‌త బీఆర్ఎస్ సర్కారు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇరిగేషన్​ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.  ‘‘గత ప్రభుత్వం రూ. 8 ల‌‌‌‌క్షల కోట్ల అప్పులు చేసి కూడా ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోయింది. పాల‌‌‌‌మూరు–- రంగారెడ్డి, మ‌‌‌‌హాత్మాగాంధీ క‌‌‌‌ల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేష‌‌‌‌న్ ప్రాజెక్ట్ సహా ఉమ్మడి పాల‌‌‌‌మూరు జిల్లాలోని ఏ ప్రాజెక్ట్ నూ పూర్తిచేయలేదు. కాగితాలపై పాలమూరు జిల్లా ఆయ‌‌‌‌క‌‌‌‌ట్టును 4.60 ల‌‌‌‌క్షల ఎక‌‌‌‌రాలకు పెంచారు త‌‌‌‌ప్ప కనీసం కాల్వలకు లైనింగ్​ చేయలేదు’’ అని విమర్శించారు. కల్వకుర్తి లిఫ్ట్​ స్కీమ్‌‌‌‌లో 5 మోటార్లు ఉంటే అందులో 2 కాలిపోయినా వాటిని పట్టించుకోలేదని మంత్రి గుర్తుచేశారు.

నాటి  సీఎం కేసీఆర్, నాటి ఇరిగేషన్​ మినిస్టర్​ హరీశ్​రావును కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పాలమూరు పెండింగ్​ప్రాజెక్టులను పట్టించుకోలేదని, తీరా ఇప్పుడు కాంగ్రెస్​ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు.  బీఆర్ఎస్ నేత‌‌‌‌ల అస‌‌‌‌త్య ప్రచారాల‌‌‌‌ను ఎట్టి పరిస్థితుల్లో న‌‌‌‌మ్మవ‌‌‌‌ద్దని ప్రజ‌‌‌‌ల‌‌‌‌ను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి సార‌‌‌‌థ్యంలోని ప్రజా ప్రభుత్వంలో రైతుల‌‌‌‌కు అన్ని విధాలా న్యాయం జ‌‌‌‌రుగుతుంద‌‌‌‌ని చెప్పారు. పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్ట్‌‌‌‌ల‌‌‌‌న్నింటినీ పూర్తి చేసి చివ‌‌‌‌రి ఆయ‌‌‌‌క‌‌‌‌ట్టుకు నీరంద‌‌‌‌స్తామ‌‌‌‌ని భరోసా ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు క‌‌‌‌సిరెడ్డి నారాయ‌‌‌‌ణ రెడ్డి, డాక్టర్​ రాజేశ్​ రెడ్డి, మేఘారెడ్డి, సీఈ విజ‌‌‌‌య‌‌‌‌భాస్కర్ రెడ్డి, ఎస్ఈ స‌‌‌‌త్యనారాయ‌‌‌‌ణ రెడ్డి, ఈఈలు శ్రీనివాస్ రెడ్డి, మాణిక్ ప్రభు, చంద్రశేఖ‌‌‌‌ర్, మురళి, త‌‌‌‌దిత‌‌‌‌రులు పాల్గొన్నారు.