ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలె : రేవంత్ రెడ్డి

ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలె : రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీలోకి రావాలని తనను అడిగినట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారించాలని పీసీసీ చీఫ్ రేవంత్‌‌‌‌ రెడ్డి డిమాండ్‌‌‌‌ చేశారు. ఫాంహౌస్‌‌‌‌ ఎమ్మెల్యేలతో పాటు కవితను కూడా విచారించాలని కోరారు. ఆమెపై కేసు నమోదు చేసి, ఎంక్వైరీ చేయాలని సిట్‌‌‌‌ అధికారి సీవీ ఆనంద్‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు. కవితను ఎవరు బీజేపీలోకి ఆహ్వానించారో తేల్చాల్సిన అవసరం సిట్‌‌‌‌పై ఉందని, సిట్‌‌‌‌ ఆ పని చేయకపోతే దోషులుగా నిలబడాల్సి ఉంటుందన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌‌‌‌లో మీడియాతో రేవంత్ మాట్లాడారు. పశువుల కంటే హీనంగా ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కొత్త డ్రామాకు తెరలేపాయన్నారు. వాటాల కోసమే బీజేపీ ఈడీ, ఐటీ దాడులు చేస్తోందని, రాష్ట్ర సంస్థలతో టీఆర్ఎస్ దాడులకు దిగుతూ చిల్లర పంచాయితీలు చేస్తున్నారని మండిపడ్డారు. సత్యహరిచంద్రులం తామే అని ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారని, నిజంగా వాళ్లు అలాంటి వాళ్లయితే, లావాదేవీల్లో పాత్ర లేనప్పుడు స్టే కోసం ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని, ధాన్యం కొనుగోలు, రైతు సమస్యలు పెరిగిపోతున్నాయని ‌‌‌‌అన్నారు. ఉద్యోగాల భర్తీ ముందుకు సాగడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్, జనాభా లెక్కలపై పార్లమెంట్‌‌‌‌లో మాట్లాడుతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రజల్లో ఎండగడతామని, దీనిపై భవిష్యత్ కార్యాచరణను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఆదివారం ఈ అంశంపై సీనియర్​ నేతలతో సమావేశమవనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ కులాల అంశంపై పోరాటం చేస్తామన్నారు. ప్రజా ప్రతినిధుల ఇండ్లపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు, వచ్చే నెల రాష్ట్రానికి కాంగ్రెస్‌‌‌‌ చీఫ్​మల్లికార్జున్ ఖర్గే వస్తున్నారని, ఆయనే దానికి సమాధానం ఇస్తారని చెప్పారు.