హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తన తండ్రి కేసీఆర్పై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అనాటి కేసీఆర్ వేరు.. ఇనాటి కేసీఆర్ వేరు అని అన్నారు. కేసీఆర్ ఆనాడు మన మనిషి.. ఈనాడు మర మనిషి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాటి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం భిక్షాటన చేశారు.. సింగరేణి కార్మికులు మరణించినా వెళ్లి చూసేవారు.. కానీ ఇప్పుడు ఏ కష్టమొచ్చినా ఆ సారు బయటకు రారు.. ఎందుకంటే ఆయన మారిన మనిషి అని విమర్శించారు.
మన కేసీఆర్ అయ్యుంటే తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చేవారని అన్నారు. కేసీఆర్ గుంట నక్కల చేతులో చిక్కుకున్నారని అన్నారు. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారని విమర్శించారు. శనివారం (ఏప్రిల్ 25) మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో కవిత తన కొత్త పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటించారు. తన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో పోరాటం చేశానని.. ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ఊరూరు తిరిగానని గుర్తు చేశారు.
‘‘మన కేసీఆర్ అయ్యింటే పాలమూరు ప్రాజెక్టును కట్టించేవారు.. మారిన కేసీఆర్ పంజాబ్ వెళ్లారు.. జాతీయ పార్టీ పెడతానని చెప్పారు.. సింగరేణిలో గనిలో కార్మికుడు చనిపోతే చూసొచ్చే వ్యక్తి.. కేసీఆర్ రాజకీయ పరిణితి కోల్పోయారు.. కేటీఆర్ మాట్లాడారంటే అనుకోవచ్చు.. ఆయనకు రాజకీయం తెలియదు.. ఒక కర్కోటకుడి పాలన నడుస్తోంది.. ఇళ్లను కూల్చుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి కేసీఆర్ ఎక్కడున్నారు..? మారుతారేమోనని చూశా.. కానీ, నన్నే సస్పెండ్ చేశారు-
ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు పంపిన రోజే నేను మాట్లాడాల్సింది.. కానీ, మాట్లాడలేదు.. ఇవాళ నాకు అదే జరిగింది.. ఉద్యమంలో కొట్టినవారినే తీసుకొచ్చి పట్టం కట్టారు.. వాళ్ల అనుచరులు మనవాళ్లను అణగతొక్కారు.. ఉద్యమకారులను నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా సరిపోయేది.. కండువా వేసుకొని అప్పుడు పిచ్చొల్లలాగా తిరిగాం.. ఆ పార్టీలో అమ్మతనం పోయింది, మమకారం పోయింది.. అందుకే కేసీఆర్ మన కేసీఆర్ కాదు.. మరబొమ్మ అయ్యారు’’ అని కవిత హాట్ కామెంట్స్ చేశారు.

