సిద్దిపేట రూరల్, వెలుగు: టీచర్లు తమ వృత్తి విలువలు, ధర్మాన్ని కాపాడాలని, విధుల్లో అశ్రద్ధ అంటే విద్యార్థుల విద్య, భద్రతలను నిర్లక్ష్యం చేయడమేనని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి అన్నారు. మంగళవారం పట్టణంలోని బాయ్స్ జడ్పీహెచ్‌ఎస్ స్కూల్‌ను ఆమె ఆకస్మికంగా సందర్శించి టీచర్ల పనితీరును పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేయకుండానే మధ్యాహ్న సమయంలో పలువురు టీచర్లు ఇంటికి వెళ్లడంపై, టీచర్ డైరీలు రాయకుండా విధులు నిర్వర్తిస్తుండటంపై అసహనం వ్యక్తం చేశారు.
తరగతి గదికి వెళ్లి విద్యార్థులను బోధన గురించి ఆరా తీశారు. సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్న తీరుపై డీఈఓ రమేశ్‌కు ఫోన్ చేసి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు సెక్టోరియల్ ఆఫీసర్ రామస్వామితో పాటు మరో ఇద్దరు అధికారులను పిలిచి పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్నారు. అంతకుముందు నంగునూరు మండలం పాలమాకుల జడ్పీహెచ్‌ఎస్ స్కూల్‌ను సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. రోజువారీ కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.
