
నస్పూర్, వెలుగు: సెప్టెంబర్ 30 వరకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ను మూసివేస్తున్నామని అటవీ సంరక్షణాధికారి ఎస్.శాంతారామ్ ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాకాలంలో పులుల ఆవాసాలు, పర్యావరణ వ్యవస్థ, భద్రతా సమస్యలు, పునరుత్పత్తి, వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా మూసి వేస్తున్నామని తెలిపారు. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో ఏర్పడే ఇబ్బందులు, వరద ప్రభావం కారణంగా పర్యాటకులు, అటవీ సిబ్బందికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు.
పులులు సహా అనేక వన్యప్రాణుల జాతుల సంతానోత్పత్తికి వర్షాకాలం ముఖ్యమైందని, కోర్ జోన్ మూసివేయడం వల్ల జంతువుల పునరుత్పత్తి, పిల్లలను పోషించుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. రోడ్లు, ఇతర రిపేర్లు చేసి రాబోయే సీజన్‌కు సిద్ధం చేస్తామన్నారు. అక్టోబర్ 1న తిరిగి ప్రారంభిస్తామని.. వన్యప్రాణుల ప్రేమికులు, పర్యాటకులు సహకరించాలని కోరారు.