వాళ్ల సపోర్ట్​తోనే కేబీసీ 13వ సీజన్​కి వెళ్లింది

వాళ్ల సపోర్ట్​తోనే కేబీసీ 13వ సీజన్​కి వెళ్లింది

కవితా చావ్లా... మహారాష్ట్రకు చెందిన ఈమె ఒక గృహిణి.  కౌన్​ బనేగా కరోడ్​పతి (కేబీసీ) షో మొదలైనప్పటి నుంచి ఒక్కసారైనా అందులో పార్టిసిపేట్ చేయాలని కలలు కనేది. ఆమె కల నిజం అయ్యేందుకు 21 ఏండ్లు పట్టింది. కేబీసీ 13వ సీజన్​లో ‘ఫాస్టెస్ట్​ ఫింగర్​ ఫస్ట్​’ రౌండ్​ వరకే పరిమితమైంది. అలాగని నిరుత్సాహపడలేదు. ఎలాగైనా కోటి రూపాయలు గెలవాలని రెట్టించిన ఉత్సాహంతో కేబీసీ 14 వసీజన్​లో అడుగు పెట్టింది. ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పి అనుకున్నట్టుగానే కోటి రూపాయలు గెలుచు కుంది. దాంతో ఈ సీజన్​లో కోటి రూపాయలు గెలిచిన మొదటి వ్యక్తిగా నిలిచింది కవిత. 

అది 2000 సంవత్సరం.. కేబీసీ షో మొదటి సీజన్​ మొదలైంది. కేబీసీ మొదలవ్వగానే టీవీ ముందు వాలిపోయేది కవిత. కంటెస్టెంట్స్​ని చూసి వాళ్లలా తను కూడా హాట్​సీట్​లో కూర్చోవాలని,  అమితాబ్​ బచ్చన్​తో మాట్లాడాలని కోటి రూపాయలు గెలవాలని అనుకునేది.  అంతేకాదు కేబీసి షోకి వెళ్లొచ్చిన వాళ్లని కలిసి మురిసిపోయేది.  కానీ, తనకు మాత్రం ధైర్యం సరిపోయేది కాదు. అందుకు కారణం... ఆమె మనసునిండా ‘నావల్ల అవుతుందా?’ అనే ప్రశ్న.

కొడుక్కి చెప్పడం కోసం...

కవితకు బాగా చదువుకోవాలని ఉన్నా ఆమె తండ్రి ఒప్పుకోలేదు. దాంతో 12వ క్లాస్ వరకే చదివింది. ఆ తర్వాత పెండ్లి చేసి పంపించేశారు. కొడుకు పుట్టాక  మళ్లీ పుస్తకాలు అందుకుంది కవిత. కొడుకుతో హోం వర్క్​ చేయించేందుకు అతడి పుస్తకాలు చదివేది. అతనికి పాఠాలు అర్థమయ్యేలా వివరించేది. పుస్తకాలతో పాటు న్యూస్​పేపర్స్​ కూడా చదివి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకునేది. దాంతో ఆమెకు కేబీసీకి వెళ్లగలననే కాన్ఫిడెన్స్​ వచ్చింది.  కవిత ఇంట్రెస్ట్​ తెలిసి భర్త ప్రోత్సహించాడు. వాళ్ల సపోర్ట్​తో కేబీసీ 13వ సీజన్​కి వెళ్లింది. కానీ, ఫాస్టెస్ట్​ ఫింగర్ ఫస్ట్​ రౌండ్​లో కంప్యూటర్ మీద వేగంగా టైప్​ చేయలేక వెనకబడి  షో నుంచి బయటకొచ్చేసింది. 

ఈసారి పట్టుదలతో కోటి రూపాయలు గెలిచింది.  

“కేబీసీ 13 వ సీజన్​ మధ్యలోనే  బయటి కొచ్చాక చాలా బాధపడ్డా. మా ఆయన, అబ్బాయి ధైర్యం చెప్పారు. కంప్యూటర్ మీద బటన్స్ నొక్కడం ప్రాక్టీస్​ చేసేందుకు మావాడు ట్యాబ్​ కొనిచ్చాడు. దాని మీద, ఫోన్​లో టైపింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. దాంతో ఈ సీజన్​లో ‘ఫాస్టెస్ట్​ ఫింగర్​ ఫస్ట్​’ రౌండ్​లో ఇబ్బంది అనిపించలేదు. ప్రైజ్​మనీలో కొంత  కొడుకు చదువు కోసం , మిగతా డబ్బు దేశం మొత్తం చుట్టి రావడానికి ఖర్చు చేస్తా” అని చెప్పింది కవిత.