కేసీఆర్ - మోడి కవల పిల్లలు.. నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారు

కేసీఆర్ - మోడి కవల పిల్లలు.. నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారు
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
  • ఢిల్లీపై యుద్ధమన్నారు.. పార్లమెంటులో ఒక్కరోజైనా కేంద్రాన్ని నిలదీయలేదు
  • బీజేపీ వ్యతిరేక పార్టీలతో రాహుల్ సమావేశానికి టీఆర్ఎస్ డుమ్మా కొట్టినప్పుడే తేలిపోయింది
  • ఈనెల 9 నుండి కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలపై పోరాటం: రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ: ‘‘తెలంగాణ సీఎం కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీ ఇద్దరూ వేరు వేరు కాదు.. కవల పిల్లల లాంటి వారు.. నాణేనికి బొమ్మ బొరుసు వంటి వారు..’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఢిల్లీపై యుద్ధం చేస్తామన్నారు.. అయితే పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ఒక్కరోజైనా నిలదీసే ప్రయత్నం చేయలేదని.. ఆయన విమర్శించారు. బీజేపీ వ్యతిరేక పార్టీలతో రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశానికి టీఆర్ఎస్ డుమ్మా కొట్టినప్పుడే బీజేపీతో వీరి దోస్తీ తేలిపోయిందని రేవంత్ రెడ్డి వివరించారు. కేసీఆర్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 9వ తేదీ నుంచి పెద్ద ఎత్తున పోరాటం మొదలుపెడుతున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 
దేశ వ్యాప్తంగా ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపికి వ్యతిరేకంగా పోరాడాలని వివిధ ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయని రేవంత్ రెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యాన మోడి వ్యతిరేక శక్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశంలో రానున్న రోజులలో మోడి వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. 
కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణ ఎడారిగా మారే అవకాశం
కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీ జలాల పై రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేశారని.. అయితే ఏపి సీఎం వైఖరి వల్ల తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందని.. తెలంగాణ సీఎం నీటి వివాదాల విషయంలో ఏపీ ప్రభుత్వ అనుకూల వైఖరి అవలంబిస్తూ, కీలక సమావేశాలకు గైర్హాజరు అయ్యారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీ మీద యుద్ధం అంటూ గతంలో ప్రకటించిన కేసీఆర్  పార్లమెంట్ సమావేశాలలో ఒక్క రోజయినా తన పార్టీ ఎంపిలతో కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేదని, రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన సమావేశానికి గైర్హాజరు కావడం వల్ల మరోసారి నరేంద్ర మోడికి అనుకూలం అని కేసీఆర్ స్పష్టం చేశారని ఆయన వివరించారు. కేసీఆర్ - మోడి వేరువేరు కాదు కవలపిల్లలు, నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 
మోడీతో ఏం మాట్లాడారో ఎందుకు బహిర్గతం చేయలేదు
పార్లమెంట్ సమావేశాల రోజు ఎంపి జోగినపల్లి సంతోష్ ఐదుగురు రాజ్యసభ ఎంపిలతో కలసి ప్రధానిని కలిసారని, కొంత సమయం తరువాత ప్రధాని మోడీతో ఎంపి సంతోష్ కుమార్ ఏకాంతంగా ఎందుకు సమావేశం అయ్యారో కేసీఆర్ సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంపి సంతోష్ కుమార్ ప్రధానితో జరిపిన సమావేశం గురించి సీఎం కేసీఆర్ కు తెలుసా ? రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై మాట్లాడితే ఎందుకు బహిర్గతం చేయలేదు అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కు సంబంధించిన ఒక్క అంశం పై కూడా 15 రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు మాట్లాడలేదన్నారు. టీఆర్ఎస్ బీజేపీ..రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఎక్కడ జరిగింది ?  అని ప్రశ్నించారు. 
ఆర్ధిక కుంభకోణాల నుంచి తప్పించుకునేందుకే మోడీకి గులాంగిరి
కేసీఆర్ తాను చేసిన ఆర్ధిక కుంభకోణాల  నుండి తప్పించుకోవడానికి ప్రధాని మోడికి గులాంగిరీ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవలంబిస్తున్న మోడీ అనుకూల విధానాల కారణంగా తెలంగాణ కు తీరని నష్టం జరుగుతోందన్నారు. ఆగష్టు 9 నుండి కేసీఆర్ అవలంబిస్తున్న దళిత, గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేతలతో పోరాటం చేయబోతున్నామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.  గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అంటే 64 కళలలో నిష్ణాతులైన వారికే ఇస్తారు..  కానీ కోవర్టు అనే 65వ కళలో నిష్ణాతుడైన కౌశిక్ రెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దీనిపై ఒక్క తెలంగాణ బిజెపి నేత మాట్లాడడం లేదన్నారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు తన పాదయాత్ర ఎందుకు వాయిదా వేసుకున్నారు ? తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండిసంజయ్ పాదయాత్ర బండి ఆగపోవడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారణం కాదా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.  కిషన్ రెడ్డి ప్రధానితో మాట్లాడి బండి సంజయ్ పాదయాత్ర ఆపించాడని రేవంత్ రెడ్డి తెలిపారు.