ఆగని వలసలు.. ఢిల్లీలో జాయినింగ్.. ఫాం హౌస్ లో మీటింగ్?

ఆగని వలసలు.. ఢిల్లీలో జాయినింగ్.. ఫాం హౌస్ లో మీటింగ్?
  •  ఆగమవుతున్న గులాబీ పార్టీ
  •  రోజుకొకరు కండువా కప్పుకుంటున్రు
  •  ఐదు రోజుల్లో ముగ్గురు జంప్!
  •  కాంగ్రెస్ లోకి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం?
  •  ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న మహిపాల్ రెడ్డి
  •  ఫాంహౌస్ మీటింగ్ కు ఎమ్మెల్యేలు బండారు, కాలేరు, సుధీర్ రెడ్డి, మర్రి డుమ్మా
  •  రేపు ఎవరుంటారో..? ఎవరు మారుతారో..?
  •  ప్రతి ఎమ్మెల్యేపైనా అనుమానం!

హైదరాబాద్: రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతుండటంతో గులాబీ బాస్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఐదు రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తంగూటికి చేరారు. రేపు ఎవరు పార్టీ మారతారనే చర్చ బహిరంగంగానే సాగుతోంది. ఈ  నేపథ్యంలో ఇవాళ ఫాంహౌస్ లో సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గైర్హాజరయ్యారని తెలుస్తోంది. ఇదే సమయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఢిల్లీలో ఉండటంతో ఆయన ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం అందుతోంది. 

ఐదు రోజుల్లో ముగ్గురు

శుక్రవారం మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. మరుసటి రోజు రాత్రి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరారు. ఇవాళ పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లారు. ఆయన కూడా కాసేపట్లో కాంగ్రెస్ లో చేరతారని తెలుస్తోంది. ఇప్పటి వరకు దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి( స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకట్రావు(భద్రాచలం), పోచారం శ్రీనివాస్ రెడ్డి(బాన్సువాడ), సంజయ్ కుమార్(జగిత్యాల) కాంగ్రెస్ లో చేరారు. 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే చర్చ నేపథ్యంలో ఐదుగురు పార్టీ మారటంతో మిగతా 20 మంది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

బాయికాడ మీటింగ్ 

ఒక్కక్కరుగా పార్టీని వీడుతుండటంతో గులాబీబాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు.. వలసల నియంత్రణలో భాగంగా ఇవాళ ఫాంహస్ లో ఎమ్మెల్యేలతో సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు బండారు లక్ష్మారెడ్డి (ఉప్పల్) కాలేరు వెంకటేశ్(అంబర్ పేట) మలిపెద్ది సుధీర్  రెడ్డి (ఎల్బీనగర్), మర్రి రాజశేఖర్ రెడ్డి(మల్కాజ్ గిరి) డుమ్మా కొట్టారని తెలుస్తోంది. దీంతో వీళ్లు కాంగ్రెస్ లోకి వెళ్తారా..? అనే చర్చ మొదలైంది. అదే జరిగితే 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్.. లాస్య నందిత మృతితో కంటోన్మోంట్ సీటను కోల్పోయి 38కి చేరింది. ఐదుగురు కాంగ్రెస్ లో చేరడంతో 33కి చేరింది. ఇవాళ గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే 32కు పడిపోతుంది. డుమ్మా కొట్టిన ఆ నలుగురు పార్టీ మారితే 28కి పరిమితమవుతుంది. ఇదిలా ఉండగా.. ఇవాళ మీటింగ్ కు హాజరైన వాళ్లంతా పార్టీలో ఉంటారా..? లేదా..? అన్నదీ సవాలేనని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.