కేసీఆర్, జగన్ ఒక్కటే..ఎమ్మెల్యేలను కలవరు : టీడీపీ నేత రుద్రరాజు పద్మరాజు

కేసీఆర్, జగన్ ఒక్కటే..ఎమ్మెల్యేలను కలవరు : టీడీపీ నేత రుద్రరాజు పద్మరాజు

హైదరాబాద్, వెలుగు : ఏపీలో  సీఎం జగన్ పైనే వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్యేలపై లేదని ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు వెల్లడించారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒకటేనని.. ఎమ్మెల్యేలను అస్సలు కలవరని ఆరోపించారు.  సోమవారం ఆయన తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో  చిట్ చాట్ చేశారు. ఏపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని జగన్​కు కేసీఆరే ఐడియా ఇచ్చారని ప్రచారం జరుగుతుందన్నారు.  తెలంగాణలోని గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, కేసీఆర్​పై తక్కువ ఉందని, ఏపీలో మాత్రం  జగన్ పైనే వ్యతిరేకత ఉందని వివరించారు. 

ఎమ్మెల్యేలపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత లేదని తెలిపారు. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ బలం పెరిగిందని, సీట్లు రాకపోయినా ఓట్ల శాతం పెరుగుతుందని చెప్పారు. ఏపీలో రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని, అక్కడ జాతీయ పార్టీల మనుగడ కష్టమన్నారు. తెలంగాణ  మంత్రులతో గతంలో కలిసి పనిచేశామని, వారిని కలిసేందుకే వచ్చానని రుద్రరాజు తెలిపారు. బీఆర్ఎస్  ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను  కూడా రుద్రరాజు పలకరించారు.