
రాష్ట్రంలో పరిపాలన, పథకాల అమలు, ఆర్థిక పరిస్థితుల పట్ల తమకు సరైన అవగాహన ఉందని చెప్పారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.
ప్రజలకు మేలు చేయగలవని భావించిన కేంద్ర పథకాలను మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పారు కేసీఆర్. ప్రజలకు పెద్దగా ప్రయోజనం చేకూర్చని పథకాల కోసం ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధాచేయదల్చుకోలేదని విస్పష్టంగా ప్రకటిస్తున్నానని చెప్పారు.
ఉదాహరణకు మనరాష్ట్రంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీ పథకం.. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కన్నా ఎంతో విశిష్టమైనదని చెప్పారు. ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేస్తోందన్నారు. కానీ ఆయుష్మాన్ భారత్ ద్వారా రాష్ట్రంలో ఏడాదికి రూ.250కోట్ల విలువైన వైద్య సేవలు మాత్రమే అందుతాయన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 85లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం కలిగితే.. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా కేవలం 26లక్షల కుటుంబాలకే మేలు కలిగే అవకాశం ఉందని చెప్పారు. ఆరోగ్య శ్రీ ద్వారా అందే అవయవ మార్పిడి సేవలు ఆయుష్మాన్ భారత్ ద్వారా అందవని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్యశ్రీ ఎన్నో రెట్లు మెరుగైనది కాబట్టే కేంద్రం పథకాన్ని వద్దనుకున్నామని చెప్పారు. ప్రతీ కేంద్ర ప్రభుత్వం పథకం విషయంలో ఇలాగే ఆలోచించి.. ప్రజల మేలు కాంక్షించి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు సీఎం కేసీఆర్.