కేసీఆర్ మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం ?

కేసీఆర్ మూడ్రోజులు ఢిల్లీలోనే మకాం ?
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశం

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. సోమవారం సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆయన బయల్దేరారు. కనీసం మూడు రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలుస్తారని సమాచారం. ఈ మేరకు సీఎంవో నుంచి రాష్ట్రపతి భవన్​ను అపాయింట్మెంట్ కోరినట్టు తెలిసింది. 

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్​లో టీఆర్​ఎస్​ ఎంపీలు అనుసరించాల్సిన పోరాట పంథాపై కేసీఆర్​ దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను కూడగట్టడంపై పలువురు నేతలతో సమావేశమయ్యే చాన్స్​ ఉంది. వివిధ రంగాల నిపుణులతోనూ కేసీఆర్ భేటీ అవుతారని తెలిసింది. సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారనే సమాచారం తప్ప ఆయన అక్కడ ఎన్ని రోజులు ఉంటారు, ఎవరెవరిని కలుస్తారనే సమాచారం సీఎంవో అధికారికంగా వెల్లడించలేదు.

సీఎం కేసీఆర్  వెంట చీఫ్ సెక్రెటరీ  సోమేశ్ కుమార్, ఎంపీలు సంతోష్ కుమార్, జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ తదితరులు ఉన్నారు.