లెఫ్ట్​తో బీఆర్ఎస్ కటీఫ్ .. సీపీఎం, సీపీఐలను పట్టించుకోని కేసీఆర్

లెఫ్ట్​తో బీఆర్ఎస్ కటీఫ్ .. సీపీఎం, సీపీఐలను పట్టించుకోని కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ పొత్తు లేనట్టే అని సోమవారం కేసీఆర్ ప్రకటించిన సీట్లతో స్పష్టమైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పార్టీలను కలుపుకొని పోయిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతున్నారు. నిన్న, మొన్నటి దాకా పొత్తులపై చర్చలు జరిపి, తీరా దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే అభ్యర్థులను ప్రకటించడంపై లెఫ్ట్ పార్టీలు మండిపడుతున్నాయి. 9 నెలల కింద జరిగిన మునుగోడు బై ఎలక్షన్ల టైమ్​లో అక్కడ కొంత బలంగా ఉన్న సీపీఎం, సీపీఐ పార్టీల మద్దతును బీఆర్ఎస్ తీసుకున్నది. దీంతో అక్కడ అధికార పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. 

అంతకుముందు, ఆ తర్వాత జరిగిన సీఎం ప్రోగ్రామ్స్​కు లెఫ్ట్ పార్టీల రాష్ట్ర కార్యదర్శులను, నేతలను ఆహ్వానించారు. ఈ క్రమంలో బీజేపీని ఓడించేందుకు లెఫ్ట్ తో కలిసి పనిచేస్తామనీ సీఎం పలు సందర్భాల్లోనూ ప్రకటించారు. దీంతో ఈసారి లెఫ్ట్, బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ప్రచారం జరిగింది. దానికి అనుగుణంగానే సీపీఎం, సీపీఐ నేతలతో బీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపారు. ఈ క్రమంలో సీపీఎం భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, మధిర, ఇబ్రహీంపట్నం తదితర సీట్లను అడగ్గా, సీపీఐ పార్టీ కొత్తగూడెం, హుస్నాబాద్, మునుగోడు, బెల్లంపల్లి సీట్లు కేటాయించాలని కోరింది. అయితే, చర్చల్లో సీపీఎంకు భద్రాచలం, సీపీఐకి మునుగోడు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రతిపాదించగా, దాన్ని ఆ పార్టీలు తిరస్కరించాయి. ఈ క్రమంలో పొత్తులపై చర్చలు జరుగుతుండగానే, సీపీఎం, సీపీఐ నేతలు అడిగిన సీట్లలో అభ్యర్థులను ప్రకటించడంతో ఆ పార్టీ నేతల్లోనూ అయోమయం నెలకొన్నది. 

ఇయ్యాల లెఫ్ట్​ పార్టీల మీటింగ్

సీఎం కేసీఆర్ అభ్యర్థుల ప్రకటన నేపథ్యంలో గుర్రుగా ఉన్న సీపీఎం, సీపీఐ పార్టీల నేతలు వేర్వేరుగా సమావేశం అవుతున్నారు. ఉదయం 10 గంటలకు ఎంబీ భవన్ లో సీపీఎం స్టేట్ సెక్రటేరియెట్ సమావేశం జరుగుతుంది. దీనికి ఆ పార్టీ ఆలిండియా పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ రాఘవన్, బీవీ రాఘవులు ఆన్​లైన్​లో అటెండ్ కానున్నారు. ఇదే సమయంలో మగ్ధుంభవన్​లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం కూడా జరగనుంది. ఈ రెండు పార్టీల సమావేశాల్లోనూ ఎన్నికల్లో పొత్తులపై చర్చించనున్నారు. ఆ తర్వాత రెండు పార్టీల ముఖ్యనేతలు మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు. ఆ తర్వాత పొత్తులు, ఎన్నికల్లో పోటీపై స్పష్టత ఇవ్వనున్నారు.

కాంగ్రెస్ వైపు ఆలోచనలు

సీపీఎం, సీపీఐ నేతలు కాంగ్రెస్ పార్టీతోనూ కలిసి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదనే సంకేతాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం జరిగిన పరిణామాలను మంగళవారం జరిగే సమావేశంలో చర్చించి, కేంద్ర కమిటీలకు సమాచారం ఇవ్వనున్నారు. ఒకవేళ కాంగ్రెస్​తో కలిసి పోతే జాతీయ పార్టీ నేతల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంది. 

అయితే, ఒకవేళ లెఫ్ట్, కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని ఇరు పార్టీల నేతలు చెప్తున్నారు. అయితే, కాంగ్రెస్ తో పొత్తుపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశముంది.