జిల్లాకో బోధన్ హాస్పిటల్ ఎప్పుడు?

జిల్లాకో బోధన్ హాస్పిటల్ ఎప్పుడు?

ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణలో మొన్నామధ్య ఎంజీఎంలో ఐసీయూలో ఉన్న ఓ పెషెంట్ ​వేళ్లను ఎలుకలు కొరికినయ్. ఆ మర్నాడు అతను చనిపోయాడు. నిన్నకు నిన్న ఇబ్రహీంపట్నం సర్కారు దవాఖానలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్​ చేయించుకున్న పాపానికి నలుగురు మహిళల ప్రాణాలు పోయినయ్. తాజా ఉదంతం డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతోపాటు వైద్యారోగ్యంలో సర్కారు డొల్లతనానికి అద్దం పడుతోంది.  రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ నియంత్రణ చేసే (డబుల్​పంచర్​ ల్యాప్రోస్కోపిక్​సర్జన్లు) డాక్టర్లు నలుగురే ఉండటం, వారిలో ఒకరు రిటైర్డ్​ వైద్యుడు కావడంతో ఒక్క డాక్టరే లెక్కలేనన్ని ఆపరేషన్లు చేయాల్సిన దుస్థితి. ఇబ్రహీంపట్నం ఘటనలోనూ ఒకే రోజు 34 మంది మహిళలకు కు.ని.ఆపరేషన్ చేశారు.

వైద్య సిబ్బంది పరికరాలను సరిగా స్టెరిలైజ్​చేయకపోవడం లాంటి కారణాలతో ఆపరేషన్ వికటించింది. నలుగురు మహిళలు చనిపోవడంతోపాటు అనేకమంది అస్వస్థతకు గురయ్యారు. జిల్లా ఆరోగ్య కేంద్రంలో నలుగురు మహిళలు మరణించడం తేలిగ్గా తీసుకునే విషయం కాదు. పేదలకు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఎలాంటి వైద్యం అందుతున్నదో తేటతెల్లం చేస్తున్న ఉదంతం ఇది. అభివృద్ధి అంటే రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం పెరగటం మాత్రమే కాదు, మానవ జీవన ప్రమాణాలు పెరగటం, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందటం. 

తగ్గిన నిధుల కేటాయింపు

‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశాం.. ఇబ్రహీంపట్నం ఉదంతం దురదృష్టకరం’ అని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తిస్థాయి చర్యలు చేపడతామని, సర్కారు హాస్పిటల్స్ లో సౌలత్​లుపెంచుతామని భరోసాని అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ భరోసా ఇవ్వడం లేదు. ఇబ్రహీంపట్నం ఉదంతం మరవకముందే వరంగల్ జిల్లా నల్లబెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 మందికి వెసెక్టమీ ఆపరేషన్ చేస్తే 8 మంది వాపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టిన 9 బడ్జెట్లలో మానవ వనరుల నాణ్యతను పెంచే వైద్యారోగ్య, విద్యారంగాలపై సర్కారు పెద్దగా నిధులు ఖర్చుచేయడం లేదు. 2014-– 15 రాష్ట్ర బడ్జెట్ లో వైద్యారోగ్య రంగానికి రూ. 460 కోట్లు కేటాయిస్తే, 2022–23 బడ్జెట్ లో రూ.11,237 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్ లో వైద్య రంగానికి కేటాయించింది 4.5 శాతం మాత్రమే. ఇందులో మందుల కొనుగోలుకు రూ. 377 కోట్లు, సర్జికల్ కోసం రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నామమాత్రపు నిధుల కేటాయింపులతో వైద్యారోగ్య రంగంలో అద్భుతాలను ఆశించటం దురాశే అవుతుంది. విద్యారంగంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వివిధ బడ్జెట్లలో చేస్తున్న ఖర్చు చాలా తక్కువే. 2014-–15 బడ్జెట్ లో విద్యారంగంపై రూ. 10,580 కోట్లు కేటాయిస్తే 2022–23 బడ్జెట్​లో రూ. 16,085 కోట్లు కేటాయించారు. 

ప్రజారోగ్య వ్యవస్థను ప్రక్షాళన చేయాలె..

ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను బలోపేతం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలైన నేషనల్ హెల్త్ మిషన్ ఆయుష్మాన్ భవ లాంటి పథకాలతో అనుసంధానం కావటం వల్ల రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్, ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లను, నర్సింగ్ స్టాఫ్ ను నియమించడం, ల్యాబ్ సౌలత్​లను మెరుగుపరచటం అవసరం. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు బాధ్యతాయుతంగా పనిచేసినప్పుడే పేద ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతాయి. ఇటీవల ఇండియాకు చెందిన ఒక టూరిస్ట్ మహిళ డెలివరీ సమయంలో పోర్చుగల్ ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వైద్యం అందక మరణిస్తే ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మార్త టోమీడో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే ఎక్కడో ఒక రైలు ప్రమాదం జరిగితే తన నైతిక బాధ్యతగా లాల్ బహుదూర్ శాస్త్రి రైల్వే మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినంత మాత్రాన పరిస్థితులు మెరుగుపడతాయని కాదు. అది వారి బాధ్యతను తెలియజేస్తుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి పరిస్థితులలో కొంతైనా మార్పు వస్తుందనే ఆశ కలుగుతుంది. ఇబ్రహీంపట్నం ఘటన తర్వాత ప్రభుత్వ స్పందన చాలా సహజంగానే ఉంది. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయకపోతే ఇలాంటి ఉదంతాలే పునరావృతం అవుతాయి. అవి రాష్ట్ర, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తాయి.

జిల్లాకో బోధన్ హాస్పిటల్ ఎప్పటికి?

తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ఉద్యమ నాయకులు ఇప్పటి ప్రభుత్వాధినేతలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రతి జిల్లాకో నిమ్స్ తరహా హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ హామీ నెరవేరకపోగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సర్కారు దవాఖాన్ల దుస్థితి ఏ మాత్రం మారకపోవడం విచారకరం. తెలంగాణ ఏర్పడే నాటికి ఐదు మెడికల్ కాలేజీలే ఉన్నాయి కాబట్టి ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న హామీని ప్రభుత్వం ఎప్పటికి నెరవేరుస్తుందో చెప్పలేని స్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం 2019–20 బడ్జెట్ లోనే ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నిత్యం కేంద్రంతో రాజకీయ ఘర్షణాత్మక వైఖరి కొనసాగించటంతో మెడికల్ కాలేజీల ఏర్పాటులో వేగం మందగించింది. ఆగ మేఘాల మీద సెక్రటేరియట్ లాంటి భారీ నిర్మాణం పూర్తి చేస్తున్న ప్రభుత్వం.. వరంగల్ లో 18 నెలల్లో హెల్త్ సిటీని పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేక పోతోంది? దీన్నిబట్టి తెలంగాణ ప్రభుత్వ  ప్రాధాన్యాలలో  వైద్యారోగ్య రంగం లేనట్లుగా కనిపిస్తోంది. బడ్జెట్ తో సంబంధం లేకుండా హాస్పిటల్స్ లో సౌకర్యాలు మెరుగుపరచడానికి రూ.10 వేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తామన్న హామీ ఏమైందో సంబంధిత శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 

- డా.తిరునహరి శేషు, సోషల్ ఎనలిస్ట్, కేయూ