స్పెయిన్లో కార్చిచ్చు..వేలాది ఎకరాల అడవి దగ్దం

స్పెయిన్లో కార్చిచ్చు..వేలాది ఎకరాల అడవి దగ్దం

బార్సిలోనా(స్పెయిన్):స్పెయిన్​తో సహా ఐరోపా అంతటా హీట్​వేవ్  కొనసాగుతోంది. వేడి వాతావరణం కారణంగా లెయిడా ప్రావిన్స్​లోని కాటలోనియా ప్రాంతంలో కార్చిచ్చు అంటుకున్నది. మంటల్లో చిక్కుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని అక్కడి అధికారులు ప్రకటించారు.స్పెయిన్​లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. జూన్​లో అత్యధికంగా 46 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. 

స్పెయిన్ హిస్టరీలో ఇప్పటి వరకు జూన్​లోనే అత్యధిక టెంపరేచరర్లు నమోదయ్యాయి. 27 ప్రధాన నగరాలు వడగాల్పులకు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. హీట్​వేవ్ కారణంగా కాటలోనియా ప్రాంతంలో మంటలు అంటుకున్నాయి. దీంతో సుమారు 14 కిలో మీటర్ల ఎత్తు వరకు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. చుట్టుపక్కల ఉన్న ఇండ్లు, షాపులపై భారీగా బూడిద పేరుకుపోయింది. 

సుమారు16వేల ఎకరాలు కాలిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫోన్లకు వార్నింగ్ మెసేజ్​లు పంపించి 14 వేల మందిని కార్చిచ్చు ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. ప్రత్యేక హెలికాప్టర్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నది. గంటకు 28 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మంటలు అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కార్చిచ్చు కారణంగా సుమారు 300 మంది వరకు గాయపడ్డారు.