ఆదిలాబాద్: రిమ్స్​ లో అరుదైన ఆపరేషన్లు.. ముగ్గురికి అన్నవాహిక క్యాన్సర్ సర్జరీలు

ఆదిలాబాద్: రిమ్స్​ లో అరుదైన ఆపరేషన్లు.. ముగ్గురికి అన్నవాహిక క్యాన్సర్ సర్జరీలు
  • ఆస్పత్రి డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ వెల్లడి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన శస్ర్త చికిత్సలు చేసి క్యాన్యర్ పేషెంట్లను రక్షించారు. బుధవారం రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.  ఆదిలాబాద్ కు చెందిన గంగుబాయి, రాంపూర్ గ్రామానికి చెందిన రాంబాబు, దీపాయిగూడకు చెందిన శివన్న కొన్నాళ్లుగా అన్నవాహిక క్యాన్సర్(ఈసోఫాగెల్)తో బాధపడుతున్నారు. వారికి అరుదైన శస్ర్త చికిత్సలు చేసి సమస్యను పరిష్కరించినట్టు తెలిపారు.

 కూర గ్రామానికి చెందిన లక్ష్మణ్​ఊపిరితిత్తుల్లోని గడ్డను ఆపరేషన్ల  ద్వారా తొలగించినట్లు చెప్పారు. ఆయా సర్జరీలను ఆంకాలజీ వైద్య నిపుణుడు డాక్టర్లు జక్కుల శ్రీకాంత్, దేవీదాస్, కుమ్మరి కార్తీక్ (యూరాలజిస్ట్ ) , బండారి నరేందర్ (అనెస్తీషియా) టీమ్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. అన్నవాహిక క్యాన్సర్ ను ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటే ఒక్కో పేషెంటుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు, ఊపిరితిత్తుల్లోని గడ్డను తొలగించడానికి రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు.  

రిమ్స్ లో నిపుణులైన డాక్టర్లు అధునాతన సౌకర్యాలతో ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు. గత ఆరు నెలల్లో ఇలాంటి శస్ర్త చికిత్సలు 600కు పైగా చేసినట్లు వివరించారు. ప్రజలు రిమ్స్ లోని వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్ఎంఓ డాక్టర్ చంపత్రావు, డాక్టర్లు హిమాని, సతీశ్, విజయ్ మోహన్, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.