కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతుల హర్షం

కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసిత రైతుల హర్షం
  • ఏండ్ల నిరీక్షణకు తెర
  •     మంత్రి వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు

కోల్​బెల్ట్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కోటపల్లి మండల పరిధిలోని రైతులకు రూ.17.41కోట్ల నష్టపరిహారం అందడంతో వారిలో ఆనందం వ్యక్తమవుతుంది. ఏండ్లుగా ఆశతో నిరీక్షిస్తున్న తమకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి చొరవతో పరిహారం డబ్బులు దక్కాయని, తమ కుటుంబాలు మంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాయని పేర్కొంటున్నారు. 

సోమవారం కోటపల్లి మండలం బబ్బెరచెలకలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రాజెక్టులో భూములు కోల్పోయిన 192.36 ఎకరాలకు సంబంధించిన 92 మంది రైతులకు రూ.17.41కోట్లకు సంబంధించిన చెక్కులను మంత్రి వివేక్​ పంపిణీ చేశారు. 

జైపూర్, చెన్నూరు మండలాల  రైతులకు మాత్రమే ఇచ్చి..

గత బీఆర్ఎస్​హయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కోటపల్లి మండలం రాపనపల్లి, ఆర్జునగుట్ట, దేవులవాడ, రావులపల్లి గ్రామాల్లో 162 మంది రైతులకు చెందిన 254 ఎకరాల  భూములు సేకరించారు. వీటికి ఎకరానికి రూ.12.50 లక్షల చొప్పున మొత్తం రూ.33 కోట్లు పరిహారంగా నిర్ణయించారు. 

జైపూర్, చెన్నూరు మండలాల్లోని భూములకు 2016 లో నష్టపరిహారం అందజేసిన నాటి ప్రభుత్వం.. కోటపల్లి మండల రైతులకు ఇవ్వకుండా మొండిచేయి చూపింది. కోల్పోయిన భూములను సర్వే చేసినప్పటికీ పరిహారం అందించకుండా చేతులు దులుపుకుంది.

రైతులను ఆదుకునేందుకు మంత్రి చొరవ

చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోటపల్లి మండలంలోని బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించడంపై వివేక్​ వెంకటస్వామి దృష్టిపెట్టారు. భూములు కోల్పోయిన, బ్యాక్​వాటర్​తో పంట నష్టపోయిన రైతుల ఇబ్బందులను అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్లారు. ఆయన చొరవ ఫలితంగా మొదట బ్యాక్​వాటర్​తో పంటలు నష్టపోయిన చెన్నూరు మండల రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పంటపరిహారం అందించారు. 

తర్వాత ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కోటపల్లి మండలం రైతుల పరిహారం ఇప్పించేందుకు సర్కార్​ను ఒప్పించారు. మంత్రి కృషితో రైతులకు పరిహారం మంజూరుకావడంతో సోమవారం చెక్కులు అందజేశారు.  మిగిలిన రైతులకు సైతం ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాల మేరకు మరోసారి రీ సర్వేకు ఆఫీసర్లను ఆదేశించారు.